AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఎఎస్ అధికారిణి కోసం ఎంపీ పైరవీ..ఎందుకోసమంటే?

ఆ ఐఏఎస్ అధికారిణి పేరు అప్పట్లో పత్రికల్లో, మీడియాలో తెగ నానేది. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపిన ఆమె.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్‌లో వుండిపోయారు. కానీ మనసంతా ఏపీపైనే.. ఇప్పుడు ఆమె కోరిక నెరవేర్చేందుకు వైసీపీ ఎంపీ ఒకరు తెగ తాపత్రయపడుతున్నారు. ఏపీ క్యాడర్‌లో చేరి, తనకిష్టమైన పనులు చక్కగా చేసుకుపోవాలన్న ఆ ఐఎఎస్ అధికారిణి ఉత్సాహాన్ని తీర్చేందుకు ఆ ఎంపీ ఎందుకంత తిప్పలు పడుతున్నారు ? ఇంతకీ ఆ అధికారిణి ఎవరు? […]

ఐఎఎస్ అధికారిణి కోసం ఎంపీ పైరవీ..ఎందుకోసమంటే?
Rajesh Sharma
|

Updated on: Nov 28, 2019 | 5:14 PM

Share

ఆ ఐఏఎస్ అధికారిణి పేరు అప్పట్లో పత్రికల్లో, మీడియాలో తెగ నానేది. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపిన ఆమె.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్‌లో వుండిపోయారు. కానీ మనసంతా ఏపీపైనే.. ఇప్పుడు ఆమె కోరిక నెరవేర్చేందుకు వైసీపీ ఎంపీ ఒకరు తెగ తాపత్రయపడుతున్నారు. ఏపీ క్యాడర్‌లో చేరి, తనకిష్టమైన పనులు చక్కగా చేసుకుపోవాలన్న ఆ ఐఎఎస్ అధికారిణి ఉత్సాహాన్ని తీర్చేందుకు ఆ ఎంపీ ఎందుకంత తిప్పలు పడుతున్నారు ? ఇంతకీ ఆ అధికారిణి ఎవరు? ఆ ఎంపీ ఎవరు?

శ్రీలక్ష్మి.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అంటే.. ఎంతో కొంత మీడియాను ఫాలో అయ్యే వారందరికీ సుపరిచితమైన పేరు. జగన్ అక్రమాస్తుల కేసులో కొన్ని నెలల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా గడిపారామె. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్ అధికారిణుల విభజనలో ఆమె తన అభీష్టానికి భిన్నంగా తెలంగాణ క్యాడర్‌లో వుండిపోవాల్సి వచ్చింది.

అయితే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఎలాగైతే ఏపీ క్యాడర్‌కు తీసుకోవాలనుకున్నారో అలాగే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూడా ఏపీకి తీసుకోవాలని తలపెట్టారు. అయితే, స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌కి కేంద్ర హోం శాఖ మోకాలడ్డిన సంగతి తెలిసిందే. కానీ శ్రీలక్ష్మి డిప్యుటేషన్ రిక్వెస్టు మాత్రం కేంద్రం వద్ద ఇంకా పెండింగ్‌లోనే వుంది. నిజానికి సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న అధికారుల ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్లకు కేంద్రం అంగీకరించదు. ఆ రీజన్‌తో శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌ని ఎప్పుడో కేంద్రం తిరస్కరించాల్సింది. కానీ, కేంద్రం ఇంకా ఆమె దరఖాస్తును పెండింగ్‌లో పెట్టింది.

దాంతో డిప్యుటేషన్‌కు స్కోప్ వుండడంతో ఈ ఫైలును మూవ్ చేయించేందుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి తెగతంటాలు పడుతున్నారట. సదరు ఫైలుతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను పలుమార్లు విజయసాయి కలిసారని ఢిల్లీ వర్గాల భోగట్టా. శ్రీలక్ష్మి కూడా ఏపీభవన్‌లో మకాం వేసి, విజయసాయిరెడ్డి అధికారిక పనులకు చేదోడువాదోడుగా వుంటున్నారని సమాచారం. తెలంగాణ క్యాడర్ అధికారిణి.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వుండకుండా.. ఏపీ భవన్‌లో వుండడమేంటన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

అధికారిక పనుల్లో తనకు సహకరిస్తున్న శ్రీలక్ష్మి డిప్యుటేషన్ వ్యవహారాన్ని ఎలాగైనా తేల్చేయాలన్న సంకల్పంతో విజయసాయి రెడ్డి తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే తరచూ ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయానికి విజయసాయి వెళుతున్నారని ఢిల్లీ మీడియా చెప్పుకుంటోంది. ఏదిఏమైనా విజయసాయి ప్రయత్నాలు త్వరలో సఫలమవుతాయని అనుకుంటున్నారంతా.