
విజయవాడ: ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని సంస్థాగతంగా బలపరచడానికి అడుగులు వేస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పలు కీలక కమిటీలను ప్రకటించారు. తర్వాత ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆగస్టు నెల మొదటివారంలో ఆయన.. భీమవరంలో పర్యటించనున్నట్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం జనసేన ఎల్లవేళలా కృషిచేస్తుందని ఆ పార్టీ నాదెండ్ల అన్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ ఆధ్వర్యంలో తొలిసారిగా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ.. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అందరి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు వివరించారు. పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చినట్లు మనోహర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్యకర్తను అభినందించారని తెలిపారు.