ఏపీ అధికార పార్టీలో అలజడి రేపుతున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌.. ఇంతకీ ఆ మంత్రి, ఎమ్మెల్యే చేసిన తప్పేంటి..?

|

Mar 06, 2021 | 12:09 PM

దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి నేతలపై ఉన్న కేసులు విచారణ..

ఏపీ అధికార పార్టీలో అలజడి రేపుతున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌.. ఇంతకీ ఆ మంత్రి, ఎమ్మెల్యే చేసిన తప్పేంటి..?
Follow us on

దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి నేతలపై ఉన్న కేసులు విచారణ వేగవంతమైంది. ఏపీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌ జారీ చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. ఇంతకీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కోర్టు ఎందుకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఇచ్చింది..? హెరిటేజ్‌తో ఉన్న గొడవేంటి…? నిజంగానే కోర్టు ఆదేశాలను ఈ ఇద్దరు నేతలు గౌరవించలేదా? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే అవన్నీ అక్రమ కేసులే అని.. వైసీపీ నేతలు కక్ష కట్టి తమపై కేసులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతూ వస్తున్నారు. అయితే తాజాగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. వీరిద్దరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా హైదరాబాద్​ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే వాయిదాకు తప్పనిసరిగా రావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంపెనీ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, ఇద్దరు నాయకులు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా.. పట్టించుకోలేదు. గత వాయిదా సమయంలో హెరిటేజ్ ఆఫిసర్ సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు ముందుకు వెళ్లడం కష్టమని గత విచారణలోనే స్పష్టం చేసింది.

రెండు నెలల కిందటే తొలుత ఈ కేసులో కోర్టు విచారణ జరిపింది. అప్పుడు కూడా ఇద్దరు ఇద్దరూ హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఆ కేసు ఫిబ్రవరి ఐదుకు వాయిదా పడింది. తాజా విచారణకు కూడా కన్నబాబు, అంబటి రాంబాబు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మంత్రితో పాటు ఎమ్మెల్యేపై నాన్-బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

ఇక నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌పై మంత్రి కన్నబాబు స్పందించారు. న్యాయస్థానాలంటే తమకు ఎంతో గౌరవమేనని… ఎప్పుడూ వాటి ఆదేశాలను లైట్ తీసుకోలేదన్నారు. హెరిటేజ్‌ కేసులో మిస్‌కమ్యునికేషన్ వల్లే కోర్టు అగౌరవంగా భావించి… నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి ఉంటుందన్నారు కన్నబాబు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని గేదెల కొన్న రైతులు… వాటి నుంచి వచ్చే పాలను హెరిటేజ్‌కే పోయాలన్న నిబంధనపైనే తాము మాట్లాడామన్నారు మంత్రి. దీనిపై స్పందించిన హెరిటేజ్‌…. తమపై పరువు నష్టం కేసు వేసిందని కన్నబాబు చెప్పుకొచ్చారు.

ఈ కేసులో ప్రతి హియరింగ్‌కు వెళ్తున్నామని… ఈ మధ్యే ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి విచారణకు హాజరై వచ్చామన్నారు మంత్రి కన్నాబాబు. ఈసారి ఎన్నికల హడావుడిలో ఉండిపోయి హాజరుకాలేకపోయామన్నారు కన్నబాబు. తమ తరఫున అడ్వకేట్‌ వెళ్లాల్సి ఉందని… కానీ ఎక్కడో కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇది పెద్ద సమస్య కాదన్న మంత్రి కన్నబాబు… హెరిటేజ్‌పై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.

హెరిటేజ్ కేసులో శుక్రవారం విచారణకు హాజరుకాలేదని కన్నబాబు, అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే వాయిదాకు కచ్చితంగా రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది.

Read More:

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు ఎంఐఎం వ్యతిరేకం.. విశాఖ స్టీల్‌పై పార్లమెంటులో పోరాడతా -అసదుద్దీన్‌ ఒవైసీ