MLC Naradasu Laxman Meeting: టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బహిష్కరణ తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలని ఏకాకిని చేసేందుకు అధికారపార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అదే సమయంలో అటు..ఈటల మద్దతుదారులు కూడా గొంతెత్తుతున్నారు. వీణవంక మండలం కోర్కల్ చేనేత సహకార సంఘం భవనంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో అలజడి రేగింది. లాక్‌డౌన్ టైంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొందరు ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ నారదాసు ఏర్పాటు చేసిన మీటింగులో జై ఈటల.. అంటూ కొందరు నినాదాలతో హోరెత్తించారు. మండల స్థాయి టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వ్యక్తులు కాదు మనకు పార్టీ ముఖ్యమని వాఖ్యానించారు. దీంతో ఈటల వర్గీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. నిన్నటిదాకా ఈటల వెంట ఉండి.. ఇప్పుడాయనకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని కొందరు తప్పుపట్టారు. దీంతో టీఆర్ఎస్, ఈటల వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.
ఈటల అనుకూల వ్యతిరేకవర్గాల వాదులాటతో టీఆర్ఎస్ మీటింగ్‌లో ఉద్రిక్తత చెలరేగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నినాదాలు చేస్తున్నవారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈటల వర్గీయులు మరింత స్వరం పెంచారు. చివరికి పోలీసులు వారిని బయటికి తీసుకెళ్లటంతో గొడవ సద్దుమణిగింది.
Video:టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ నారదాసు సమావేశం.. ఈటల అనుకూల వ్యతిరేకవర్గాల వాదులాట