AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Mission 2022: వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు టార్గెట్.. ఇమేజ్ బూస్టర్‌పై కమలనాథుల ఫోకస్

BJP Mission 2022: వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. వరుసగా సమావేశాలు, మంతనాలు సాగిస్తూ వ్యూహ-ప్రతివ్యూహాలు రచిస్తోంది.

BJP Mission 2022: వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు టార్గెట్.. ఇమేజ్ బూస్టర్‌పై కమలనాథుల ఫోకస్
Representative Image
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:25 PM

Share

(మహాత్మ కొడియార్, TV9 తెలుగు, ఢిల్లీ బ్యూరో చీఫ్)

Assembly Elections 2022: వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. వరుసగా సమావేశాలు, మంతనాలు సాగిస్తూ వ్యూహ-ప్రతివ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. వీటిలో పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీకి కూడా వీటితో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ సృష్టించిన సునామీలో ఇన్నేళ్లుగా నిర్మించుకున్న ప్రధాని మోదీ ప్రతిష్ట కాస్తా తీవ్రంగా దెబ్బతినడంతో, మళ్లీ దాన్ని పునర్నిర్మించుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కమలనాధులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) సహా పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు తీవ్రస్థాయిలో మేధోమధనం చేస్తున్నారు.

కలవరపెడుతున్న వైఫల్యాలు

అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాషాయదళాన్ని సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం తీవ్రస్థాయిలో కలవరపెడుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఘోరంగా విఫలమైందన్న అపఖ్యాతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం గూడుకట్టుకుని నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయే ప్రమాదముందని నాయకత్వం గుర్తించింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇదే రాష్ట్రం వరుసగా రెండుసార్లు మోదీని ప్రధానిని చేయడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి రాష్ట్రంలో పట్టు కోల్పోతే, 2024 సార్వత్రిక ఎన్నికలకే ఎసరు పెట్టే ప్రమాదముందని నాయకత్వం భావిస్తోంది. ఈ రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమి జాతీయ నాయకత్వాన్ని కలచివేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా గోరఖ్‌పూర్‌లోనే బీజేపీ కంటే ప్రతిపక్షాలు, స్వతంత్రులు ఎక్కువ చోట్ల గెలుపొందారు. అయోధ్యలో పరిస్థితి మరీ దారుణం. 40 సీట్లలో బీజేపీ గెలిచించి కేవలం ఆరు మాత్రమే. సమాజ్‌వాదీ పార్టీ 24 చోట్ల గెలుపొందగా, 5 సీట్లు బీఎస్పీ వశమయ్యాయి. మథురలో 33 సీట్లకు 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందగలిగింది. 13 చోట్ల మాయావతి పార్టీ బీఎస్పీ గెలుపొందింది.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో అత్యధిక సంఖ్యలో ఎంపీలను అందించిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాత్రం తేడా వచ్చినా, ఢిల్లీ పీఠాలు కదిలిపోయే ప్రమాదముంది. జనాభాపరంగా చూస్తే అనేక ప్రపంచదేశాల కంటే పెద్దదైన ఉత్తర్ ప్రదేశ్, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో పెద్ద రాష్ట్రం బెంగాల్‌లో పట్టుసాధించాలన్న కమలనాథుల కల తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెదిరిపోయింది. దీంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీలో నెలకొంది.

PM Modi- Amit Shah

PM Modi- Amit Shah

దిద్దు’బాట’లో పార్టీ, ప్రభుత్వం…

సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యాలు ప్రధానికి, పార్టీకి తీసుకొచ్చిన అపఖ్యాతిని పోగొట్టి ప్రతిష్టను మళ్లీ నిర్మించడానికి ‘సేవ’ ఒక్కటే మార్గమని పార్టీ నాయకత్వం భావించింది. పైగా పార్టీ కార్యకర్తలను ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా చేస్తే నిస్తేజంగా, నిరుత్సాహం నింపుకున్నవారిలో చలనం వస్తుందని తలచింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణను నాయకత్వం రూపొందించింది. పార్టీ నినాదం ‘సేవా హి సంఘటన్’ (సేవయే సంస్థ) కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ.. కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని, కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు చేతనైనంత సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్లు పూర్తయినా సరే, ఎలాంటి వేడుకలు, సంబరాలు చేసుకోకుండా, పార్టీ శ్రేణులను సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం చేసింది. సెకండ్ వేవ్ సునామీలో తల్లిదండ్రులను, లేదా ఇంట్లో పోషించే వ్యక్తిని కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించింది. మరోవైపు జాతీయస్థాయిలో పీఎం-కేర్స్ నిధుల నుంచి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునే పథకాన్ని ప్రారంభించింది. కొన్ని దశాబ్దాలుగా పార్టీ నినాదంగా మారిన అయోధ్య రామాలయ నిర్మాణం పనులను స్వయంగా ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తున్నారు. ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ వెంటనే కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నికంటే 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా ఉచితం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దిద్దుబాటు చర్యగా చెప్పవచ్చు.

BJP National President JP Nadda

BJP National President JP Nadda

ఎదురుదాడి వ్యూహాలు – గెలుపు సమీకరణాలు

కార్యకర్తలకు, కింది స్థాయి నాయకత్వానికి పనులు అప్పగించి అగ్ర నాయకత్వం ఊరికే కూర్చోవడం లేదు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యే విమర్శల నుంచి మొదలుపెట్టి, రాజకీయంగా దేశంలోని వివిధ పార్టీల నుంచి ఎదురయ్యే విమర్శల వరకు ప్రతి విమర్శనూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. వ్యాక్సిన్ల విషయంలో ప్రతిపక్ష నేతలు నాడొక విధంగా – నేడొక రకంగా స్పందిస్తున్నారంటూ ప్రధాన మంత్రి సహా కేంద్ర మంత్రులే స్వయంగా ఎదురుదాడి వ్యూహాన్ని ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలన్నీ ఎన్ని విమర్శలు చేసినా, వాటన్నింటినీ ఎదుర్కొని తిరుగులేని విజయం సాధించినట్టే ఈసారి కూడా సెకండ్ వేవ్ వైఫల్యాలను అధిగమించాలని కమలదళం భావిస్తోంది. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా సఫలం కావని కమలనాథులు భావిస్తున్నారు. ఆయా పార్టీలన్నీ తమ తమ రాష్ట్రాల్లో తప్ప వేరే రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేవని అంచనా వేస్తున్నారు. పార్టీల మధ్య అనైక్యతనే ఆయుధంగా మలచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ముఖాముఖి పోరున్నచోట గెలవాలంటే పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు సాధించాలి. అదే బహుముఖ పోరున్న చోట మిగతా పార్టీల కంటే ఒక్క శాతం ఎక్కువ ఓట్లు సాధించినా గెలుపు సాధించవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ప్రతిపక్షాలు జాతీయస్థాయిలో ఏకతాటిపైకి వచ్చినట్టు కనిపించినా, క్షేత్రస్థాయిలో ఒక పార్టీకి మరొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు. బెంగాల్‌లో బద్ధ విరోధులైన టీఎంసీ, కమ్యూనిస్టులు ఇతర రాష్ట్రాల్లో కలిసి పోటీచేసిన ఫలితం శూన్యం. పైగా బెంగాల్ బయట టీఎంసీ ప్రభావం ఎక్కడా లేదు. ఇదే ఉదాహరణ మిగతా అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయపార్టీలు సమాజ్‌వాదీ-బహుజన్ సమాజ్ పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. సెకండ్ వేవ్ ద్వారా దెబ్బతిన్న ప్రతిష్టను పునర్నిర్మించుకోగల్గితే, ఎవరెన్నిరకాలుగా జట్టుకట్టినా పెద్దగా ప్రమాదం లేదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల కూటముల కంటే కోల్పోయిన ప్రతిష్టే బీజేపీని ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.