తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరజంన్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలోనే మకాం వేసిన ఆయన తాజాగా ఖిల్లా ఘణపురం మండలకేంద్రంలో, పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, వెల్టూరులలో పార్టీ కార్యకర్తలు, నేతలు, పట్టభద్రులతో సమావేశమై పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల బతుకులను ప్రైవేటు పరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటేసేవాళ్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఉద్యోగాలిచ్చినా, పదోన్నతులు ఇచ్చినా, జీతాలు పెంచినా చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వమేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పదోన్నతులు ఆగడానికి, నూతన డీఎస్సీ వేయకపోవడానికి కేంద్రం జోనల్ వ్యవస్థ ఫైలుకు ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టడమే కారణమన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి జోనల్ వ్యవస్థ అనుమతికి పంపిన ఫైలుకు నాలుగున్నరేళ్లుగా అనుమతివ్వడం లేదు. ఐటీఐఆర్ ను తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం పక్కనపెట్టింది. ఐటీఐఆర్ ఇవ్వము అని కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని యువత నిలదీయాలని నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 14 వేల పరిశ్రమలతో 15 లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు.
ఏడేళ్ల మోడీ పాలనలో ప్రజలకు ఉపయోగం కలిగే ఒక్క పథకం వచ్చిందా ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. నష్టాల పేరుతో బీఎస్ఎన్ఎల్ ను అమ్మేసింది నిజం కాదా ? మోడీ నడిపితే నష్టాలొస్తున్నప్పుడు, అంబానీలు, ఆదానీలకు లాభాలు ఎలా వస్తున్నాయి ? ప్రైవేటు పరమైతే రిజర్వేషన్లకు మంగళం పాడినట్లే, బడుగు, బలహీన వర్గాలు ఈ విషయాన్ని గమనించాలని నిరంజన్‌రెడ్డి కోరారు.
ప్రజలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పనిచేసే వారిని ఆదరించి గెలిపించాలి. సింగరేణి సంస్థను అమ్మే కుట్రకు కేంద్రం తెరలేపింది. జాతీయ రహదారులను అమ్మేస్తున్నారు .. టోల్ గేట్లతో ప్రజల తోలు వలుస్తున్నారు. – గడచిన ఆరేళ్లలో బీజేపీ పాలిత 21 రాష్ట్రాలలో తెలంగాణను మించి ఏవైనా పథకాలు అమలు చేశారా ? తెలంగాణ మాదిరిగా ఏదైనా రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు ఇచ్చారా ? పొరపాటున ఇతరలకు ఓటేస్తే ప్రజలకు ఏమీ న్యాయం జరగదని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ పాలనలో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. – టీఆర్ఎస్ పాలనలో లాభపడని కుటుంబం ఉందా ? తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం కింద లబ్ది పొందుతున్నారు. ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నాం. ప్రతి రైతుకూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఆడబిడ్డకు అంగన్ వాడీలో అమ్మవడి కింద పౌష్టికాహారం అందించడం నుండి కడుపులబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేయించేది మనం, కళ్యాణలక్ష్మితో పెళ్లి చేసేది మనం. పిల్లలు చదువుకోవడానికి వెళ్తే ఫీజు రీ ఎంబర్స్ మెంట్, గురుకులాలతో చదువు చెప్పించేది మనం, అవ్వ తాతకు ఆసరా ఫించను, తండ్రికి రైతుబంధు ఇచ్చేది మనం. ప్రమాదవశాత్తు ఎవరు ఏ కారణం చేత మరణించినా రైతుభీమా ఇచ్చేది మనం. దిక్కులేని చావులు ఉండొద్దు, అంతిమఘడియలకు లోటు రావొద్దు అని వైకుంఠధామాలు కట్టించేది కూడా తెలంగాణ ప్రభుత్వమే పుట్టిన దగ్గర నుండి పోయేదాకా పనులు చేసేది తెలంగాణ ప్రభుత్వమే అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. కార్యకర్తలు ప్రతి పట్టభద్రున్ని కలిసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించాలని చెప్పారు.
Read More: