AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత పార్టీకి చెందిన మంత్రి ప్రకటన తెలియదంటావా..? ఏ అజ్జానంలో ఉన్నావు బండీ.. మంత్రి కేటీఆర్‌ ధ్వజం

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శల దాడి పెంచారు. నిరుద్యోగులే లక్ష్యంగా ఇరు పార్టీల ప్రచారం..

సొంత పార్టీకి చెందిన మంత్రి ప్రకటన తెలియదంటావా..? ఏ అజ్జానంలో ఉన్నావు బండీ.. మంత్రి కేటీఆర్‌ ధ్వజం
K Sammaiah
|

Updated on: Mar 03, 2021 | 6:02 PM

Share

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శల దాడి పెంచారు. నిరుద్యోగులే లక్ష్యంగా ఇరు పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉద్యోగాల భర్తీపై మీరు విఫలమయ్యారంటే మీరు విఫలమయ్యారంటూ ఒకరపై ఒకరు విమర్శలతో చాలెంజ్‌లు చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం రసరవత్తరంగా సాగుతుంది. ఇక తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగిన మంత్రులు బీజేపీ నేతలే టార్గెట్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ కేటీఆర్ ధ్వజమెత్తారు.

గతంలో హామీ ఇచ్చి, దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ను మూలకు నెట్టింది బీజేపీయేనని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ప్రకటనే నిదర్శనం అని అన్నారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్ అంశంపై బండి సంజయ్ లేఖ రాసిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ అంశంలో బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అని విమర్శించారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే లేఖ రాశారని, సిగ్గులేకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బట్టబయలైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ అంశంలో ముందుకు రాని బీజేపీ… నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో బెంగళూరు నగరంలోనే ఐటీఐఆర్ ఒక్కడుగు కూడా ముందుకు పోలేదని విమర్శించారు. “తెలంగాణలో ఐటీఐఆర్ పురోగతిపై తమను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు… బెంగళూరులో ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి కూడా మా ప్రభుత్వమే కారణం అంటారా?” అని కేటీఆర్ నిలదీశారు. 2014 నుంచి రాసిన లేఖలను, అన్ని వివరాలతో సమర్పించిన ప్రాజెక్టు నివేదికలను బండి సంజయ్ కు ఇస్తామని, ఐటీఐఆర్ ను తీసుకురాగలరా? లేకపోతే ఐటీఐఆర్ కు సమానమైన మరో ప్రాజెక్టును తీసుకురాగలరా? అంటూ సవాల్ విసిరారు.

మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో ఉన్న అధికారపార్టీ.. రాష్ట్రంలో ఉన్న అధికారపార్టీ మధ్య రాజకీయ విమర్శలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విమర్శలు, సవాళ్లు మరింత పీక్‌ స్టేజ్‌కి చేరుకోనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంగా సాగుతున్న విమర్శల జడి నాగార్జున సాగర్‌ వరకు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడున్నాయి.

Read More:

మాకు మద్దతిస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం.. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ