బెంగళూరు: కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.గత వారం రోజులుగా సాగిన కర్నాటక పొలిటికల్ డ్రామా చివరకు కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడంతో ముగిసింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జెడీఎస్ వినతిని స్పీకర్ తోసి పుచ్చడంతో, కుమార సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్, నామినేటేడ్ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి. అసెంబ్లీ నుంచి రాజభవన్ వరకు కుమారస్వామి నడుచుకుంటూ వెళ్లనున్నారు.