
హాట్ హాట్‌గా జరుగుతున్న ఏపీ ఎన్నికల ప్రచారంలో తన కామెడీతో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎన్నికల బరిలో నిలిచిన దగ్గరి నుంచి పాల్ వినూత్న రీతిలో ముందుకెళ్తున్నారు. మొదట ‘ఏపీకి కాబోయే సీఎం నేనే’ అంటూ అందరి దృష్టిని ఆకర్షించి ముందుకు కదిలారు పాల్. ఇక ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో టికెట్లు, బీఫారాల దగ్గరి నుంచి.. భీమవరంలో ఆయన నామినేషన్ తిరస్కరణ వరకు ప్రతి చోట పాల్ కామెడీ చేస్తూనే ఉన్నారు.
ఓటర్లకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ, వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ, బాక్సింగ్ చేస్తున్నట్లు పంచ్‌లు ఇస్తూ.. కామెడీ పంచ్‌లు విసురుతున్నారు పాల్. వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలు మాటలతో దాడులు చేసుకుంటుంటే.. ఆయన మాత్రం ఫన్నీగా అందరినీ నవ్విస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నారో..? లేదా వినూత్న రీతిలో ప్రచారం చేద్దామనుకున్నారో..? తెలీదు గానీ ఆయన రోడ్‌షోలు మాత్రం డిఫరెంట్‌గా సాగుతున్నాయి.