జనం కోసం ‘జగన్’ మారాడా?

| Edited By: Srinu

Apr 04, 2019 | 6:19 PM

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. కానీ ఇది ఇప్పుడు.. ఒకప్పడు మాత్రం ఆయన తండ్రి చాటు బిడ్డ. ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంతకాలం శాసించిన  మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి మరణంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు జగన్. అంతకుమందు ఆయన ఎంపీగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పెద్దగా తెలియదు. దివంగత వైఎస్సార్ చావును జీర్ణించుకోలేక […]

జనం కోసం జగన్ మారాడా?
Follow us on

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. కానీ ఇది ఇప్పుడు.. ఒకప్పడు మాత్రం ఆయన తండ్రి చాటు బిడ్డ. ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంతకాలం శాసించిన  మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి మరణంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు జగన్. అంతకుమందు ఆయన ఎంపీగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పెద్దగా తెలియదు. దివంగత వైఎస్సార్ చావును జీర్ణించుకోలేక చనిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి నడుం బిగించాడు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్ ఓదార్పు యాత్రకు అడ్డు చెప్పడంతో.. పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ సీపీని స్థాపించాడు. అమితమైన ప్రజాదారణ లభించినా కూడా.. 2014 ఎన్నికల్లో గెలుపు వాకిట వరకు వచ్చి చతికిలపడ్డాడు. దీనికి ఎన్నికలకు ముందు జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కారణమనేది పార్టీ నుంచి బయటకు వచ్చిన చాలామంది చెప్పే మాట. ఆయన వయసుకు, అనుభవమున్న నాయకులకు కూడా గౌరవం ఇవ్వరని, తన తండ్రి వయసున్న వాళ్లని, దివంగత వైఎస్సార్‌తో కలిసి పనిచేసిన వాళ్లను కూడా ‘సార్’ అని సంభోదించమంటారంటూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. మనం అనే మాట కన్నా నేను అనే గర్వం జగన్‌లో ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు మైండ్ గేమ్‌లో భాగమంటూ వైసీపీ సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. వైసీపీ ఓడిపోవడానికి టీడీపీ ప్రవేశపెట్టిన  రైతు రుణమాఫీ, నవ్యాంధ్రప్రదేశ్‌కి అనుభవమున్న నేత కావాలని ప్రజలు కోరుకోవడం, జనసేనాని మద్ధతు వంటి మేజర్ కారణాలు కూడా ఉన్నా.. జగన్ వ్యవహారశైలి కూాడా కొంత మేర ప్రభావం చూపింది.

కానీ.. 2014 ఎన్నికల తర్వాత జగన్‌లో అసాధారణమైన మార్పు కనిపిస్తూ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార పక్ష విమర్శలకు మొదట్లో ఆవేశానికి లోనైన జగన్ ఆ తర్వాతి కాలంలో.. ఆచి, తూచి వ్యవహరించడం మొదలెట్టారు. విమర్శలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ..ఒక్కోసారి అధికారపక్షాన్ని కూడా డిఫెన్స్‌లో పడేయడం వంటి అంశాలు జగన్‌లో మానసిక స్థైర్యాన్ని ప్రజలకు చూపించాయి. తనకు తోడుగా ఎవరూ అనుభవమున్న నేతలు లేకపోవడం.. జ్యోతులు నెహ్రూ లాంటి వారు ఉన్నా కూడా వారిని అధికారపక్షం తమ వైపు లాక్కోవడం.. వంటి ఘటనలు జగన్ మరింత రాటుదేలేందుకు ఉపయోగపడ్డాయి. ముఖ్యమంత్రితో పాటు ప్రతి మంత్రి, ఎమ్యెల్యేలు కూడా చేసే విమర్శలకు జగనే వివరణలివ్వడం మొదలెట్టాడు. మొట్టమెదటి సారి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తేనా అనిపించేలా జగన్ తనని తాను తీర్చిదిద్ధుకున్నాడు. క్రమంగా పబ్లిక్ మీటింగ్స్‌లో ఆయన మాట్లాడే విధానం, జనాన్ని ఆకట్టుకునే విధంగా  స్పీచ్‌లు ఇవ్వడం వంటి అంశాలు అనతికాలంలోనే జగన్‌ను క్రౌడ్ పుల్లర్‌గా మార్చేశాయి. మధ్యమధ్యలో నంద్యాల ఉపఎన్నిక లాంటి ఎదురుదెబ్బలు తగిలినా కూడా జగన్ మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రయత్నించడం, 3,648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర, అధికారపక్ష ఫెయిల్యూర్స్‌పై ఎప్పటికప్పుడు ఎదురుదాడి వంటి అంశాలు జగన్‌ను ఒక బలమైన రాజకీయ నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. లేకపోతే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు..ప్రధాన మంత్రులను శాసించే అపర మేథావిగా, అనితర చాణుక్యుడిగా, అనుభవమున్న నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు ఎదురునిలవడం అంటే సాధా సీదా విషయం కాదు.

చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఎప్పట్లానే ఎన్నికల నగారా మోగనే మోగింది. ఎప్పట్లానే చంద్రబాబు అభివ‌ృద్ధి మంత్రంగా ఎన్నికల బరిలోకి దిగారు. జగన్ ఒక్క అవకాశం అంటూ అభ్యర్థిస్తున్నారు. మార్పు కావాలంటే సేన వైపు చూడండి అంటూ పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు. మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? అనుభవానికి జయహో అంటారా? జగన్‌‌కి జై కొడతారా? జనసేనానితో సహవాసం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.