ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 175 సీట్లకు గానూ 151 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 సీట్లను సొంతం చేసుకొని.. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. జగన్ ముందు ఇప్పుడు పెను సవాళ్లున్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రత్యేక హోదా.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తరువాత 2014 ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ప్రత్యేక హోదాను ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. ఇక విజయం తరువాత కూడా కొన్ని రోజులు ప్రత్యేక హోదాను నాన్చిన ఎన్డీయే ప్రభుత్వం.. చివరకు ఇవ్వలేమంటూ తేల్చేసింది. దీంతో అటు బీజేపీపై, ఇటు టీడీపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
కాగా మరోవైపు ప్రత్యేక హోదా నినాదాన్ని వైఎస్ జగన్ 2014 ఎన్నికల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల తరువాత ప్రతిపక్షంలో ఉంటూ ప్రత్యేక హోదానే మా నినాదం అంటూ దీక్షలు కూడా చేశారు. అంతేకాదు అటు లోక్‌సభలోనూ తన ఎంపీల చేత రాజీనామా చేయించారు. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఈ నినాదాన్నే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో యుద్ధానికి సిద్ధమని.. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదంటూ జగన్ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు.
ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 22 లోక్‌సభ సీట్లను సొంతం చేసుకొని.. పార్లమెంట్‌లో అతిపెద్ద నాలుగవ పార్టీగా రికార్డు సృష్టించారు. ఇక ఈ విజయంపై జగన్ గురువారం మాట్లాడుతూ.. ‘‘అద్భుత విజయాన్ని సాధించాం. కానీ ఈ సీట్లతో ప్రత్యేక హోదాను తీసుకురావడం కష్టమే అవుతుంది. కానీ హోదాపై మా ఉద్యమాన్ని మాత్రం ఆపం. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకొని హోదా గురించి ఆయనకు వివరిస్తాను. మా డిమాండ్లను నెరవేర్చుకునే వరకు పోరాడుతాం’’ అంటూ తెలిపారు.
అయితే ఏది ఏమైనా ఈ సీట్లతో ప్రత్యేక హోదా సాధన కష్టమన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే జగన్‌కు 22 సీట్లు వచ్చినా.. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో ఎన్డీయే రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ క్రమంలో హోదాను ఇవ్వలేమంటూ గతంలోనే తేల్చి చెప్పిన ఎన్డీయే.. ఇప్పుడు కూడా అదే వైఖరిని కొనసాగించవచ్చని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న జగన్.. మిగిలిన పార్టీల మద్దతులో హోదాను సాధిస్తారేమో చూడాలి. కాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ ఇప్పటికే తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.