ఆమంచి కృష్ణమోహన్.. ప్రకాశం జిల్లాలో ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. జెడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన ఆమంచి.. ఆ తరువాత చీరాల నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి అనుకోకుండా ఓటమి చవిచూశారు. దీంతో వైసీపీలో ఆయన స్థానం తగ్గుతుందని చాలా మంది భావించారు. కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మనసులో మాత్రం ఆమంచికి మంచి స్థానం ఉందట. ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ.. ఆయనను తన సన్నిహితుడిగా చేసుకున్నారట జగన్. ఈ నేపథ్యంలో ఆమంచికి ఓ ముఖ్యమైన పనిని కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. అదేంటంటే వైసీపీలో చేరాలనుకునే వారితో చర్చలు జరిపే పనిని వైసీపీ అధిష్టానం ఆయనకే అప్పగించిందని టాక్.
అంతకుముందు వైసీపీ పార్టీలో చేరాలనుకునే వారు.. జగన్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని సంప్రదించేవారు. ఆయన ఓకే అంటే దాదాపుగా వైసీపీ సభ్యత్వం వచ్చినట్లుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలను జగన్, విజయ సాయి ఇద్దరూ.. ఆమంచికే అప్పగించారట. గతంలో టీడీపీలో ఉన్న ఆమంచికి ఆ పార్టీలోని పలువురు నాయకుల లొసుగుల గురించి బాగా తెలుసు. ఆమంచి అనుకుంటే టీడీపీకి పుట్టగతులుండవు అని విజయసాయి కూడా అన్నారట. ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు టాక్. ఇదిలా ఉంటే తనకు ఇచ్చిన బాధ్యతలను ఆమంచి కూడా అప్పుడే ప్రారంభించేశారట. ఆపరేషన్ ఆమంచి పేరుతో పలువురిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్యే పదవి లేనప్పటికీ ఆమంచి ఇప్పుడు వైసీపీలో కింగ్‌గా ఉన్నాడన్నది రాజకీయ వర్గాల సమాచారం.