
హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మారింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అవ్వడంతో.. ఈసీ ఈ స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత మూడు పర్యాయాలుగా ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తూ.. కంచుకోటగా మార్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా టీఆర్ఎస్ కారు వేగానికి కొట్టుకుపోయినా.. కారు వేగాన్ని ఎదుర్కొని ఉత్తమ్ ఎదురు నిలిచారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నల్గొండ ఎంపీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించడంతో.. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి అనివార్యమయ్యింది. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని ఎవరు వశం చేసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీఆర్ఎస్‌కు అందని ద్రాక్షగా..
హుజూర్ నగర్ స్థానం టీఆర్ఎస్ పార్టీకి అందని ద్రాక్షగా మారింది. ఇక్కడి నుంచి మూడు సార్లు పోటీచేసినా.. గెలవలేకపోయింది. 2014లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. అయితే తెలంగాణ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనుకున్న టీఆర్ఎస్‌కు ఆశాభంగం కలిగింది. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సైదిరెడ్డి పోటీ చేసి 7వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్లు వేసి బరిలోకి దిగింది. ఈసీ షెడ్యూల్ రిలీజ్‌కు ముందే.. మరోసారి శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించి గెలుపు వేటలో ఉన్నట్లు సంకేతాలను ఇచ్చింది ప్రత్యర్థులకు. అంతేకాదు.. ఇప్పటికే.. నియోజక వర్గ బాధ్యతలను మంత్రులకు అప్పగించడంతో పాటు.. ప్రతి మండలానికి ఓ మంత్రి ప్రచారం చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ఓ స్లోగన్ కూడా ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే.. ఉత్తమ్‌కే లాభమని.. అదే టీఆర్ఎస్ గెలిస్తే.. రాష్ట్రానికి లాభమంటూ ప్రచారం అందుకున్నారు. అంతేకాదు.. అవసరముంటే అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగేందుకు ప్లాన్లు వేస్తున్నారు. మొత్తానికి ఎట్టిపరిస్థితుల్లోనూ.. హుజూర్‌నగర్ స్థానాన్ని వశం చేసుకునేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలకు పదునుపెట్టారు. అంతేకాదు… ఈ సారి సీపీఐ, బీజేపీలు పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. అది టీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అంశంగా మారనుందన్న అభిప్రాయం వెల్లడవుతుంది
సిట్టింగ్ నిలబెట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్..
హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఇప్పుడు హస్తానికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు పర్యాయాలుగా ఇక్కడ హస్తం గాలులు వీస్తూ వచ్చాయి. అయితే ఈ సారి ఉత్తమ్ సతీమణి పద్మావతికి సీటును కేటాయించడంతో.. జిల్లాకు చెందిన నేతలంతా ఆమోదం తెలిపినా.. తొలుత రేవంత్ రెడ్డి వర్గం మాత్రం వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు ఇదే అంశం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా కారెక్కితే.. పరిస్థితి ఏ విధంగా మారుతుందోనన్న అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలయ్యాయి. దీనికి నిదర్శనంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్ అధికారులు ప్రలోభ పెడుతున్నారంటూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అయితే నియోజకవర్గంలో ఉత్తమ్ చేసిన అభివృద్ధితో పాటు.. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రచారంలోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు.. నియోజకవర్గంలో ఉత్తమ్ సామాజిక వర్గం కూడా ఆయన వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నేతలు పార్టీ మారినా.. ప్రజలు ఉత్తమ్‌ను సమర్థిస్తే.. పద్మావతి విజయం సాధిచండం ఖాయమే. కానీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 7వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. అప్పుడు ట్రక్కు సింబల్ ఉండటంతో ఓట్లు కోల్పోయామని టీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. ఈ సారి ఆ ట్రక్కు సింబల్ లేకపోవడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ పోటీలో ఉండే అంశంపై టీడీపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ నేతలు హుజూర్ నగర్‌లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా చేసేందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే హుజూర్ నగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి మహాకూటమి అభ్యర్థిగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో ఒకసారి విఫలమైన మహాకూటమి… మళ్లీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పురుడు పోసుకుంటుందా అన్నది త్వరలోనే తేలనుంది.
బీజేపీ ఎంట్రీతో త్రిముఖ పోరు..
అయితే టీఆర్ఎస్ ఎంట్రీతో ద్విముఖ పోరుగా ఉంటుందనుకున్న పోటీ కాస్త.. బీజేపీ బరిలోకి దిగడంతో.. అది కాస్త త్రిముఖ పోరుగా మారింది. తొలుత శ్రీకళారెడ్డిని అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించినట్లు వార్తలు వచ్చినా… అనూహ్యంగా ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో బీజేపీ మళ్లీ అభ్యర్థిని వెతికే పనిలో పడింది. కోట రామారావును హుజూర్ నగర్ అభ్యర్థిగా ఎంపీక చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ బహుజన కార్డు ఉపయోగించేందుకు రామారావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం.. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకోగలిగింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనైనా.. హుజూర్‌నగర్‌లో పోటీ చేసి గెలవడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కమలనాథులు కూడా తమ వ్యూహాలకు పదునుపెడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తున్నారు
మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో మరో నెల రోజులు వేచి చూస్తే తెలిసిపోతోంది.