ఆ 2 మండలాలే కీలకం.. జీ ‘హుజూర్’ అంటున్న అభ్యర్థులు

ఆ 2 మండలాలే కీలకం.. జీ 'హుజూర్' అంటున్న అభ్యర్థులు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బరిలో ఎందరున్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యనే వుంది. కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ నేతలు విజయం కోసం తెగ శ్రమిస్తున్నారు. ప్రచారఘట్టం తర్వాత తెరచాటు రాజకీయాలు కూడ జోరందుకున్నాయి. ఈ క్రమంలో హుజూర్‌నగర్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఎవరికి వారు తమకు తోచినట్లుగా విశ్లేషించుకుంటున్నారు. అయితే హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలు అత్యంత కీలకం కావడంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2019 | 1:35 PM

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బరిలో ఎందరున్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యనే వుంది. కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ నేతలు విజయం కోసం తెగ శ్రమిస్తున్నారు. ప్రచారఘట్టం తర్వాత తెరచాటు రాజకీయాలు కూడ జోరందుకున్నాయి. ఈ క్రమంలో హుజూర్‌నగర్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఎవరికి వారు తమకు తోచినట్లుగా విశ్లేషించుకుంటున్నారు. అయితే హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలు అత్యంత కీలకం కావడంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు అక్కడ మకాం వేసి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు.

ఇంతకీ ఆ రెండు మండలాలేవీ అంటారా.. ? హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్ల చెరువు, చింతపాలెం మండలాలే ఇక్కడి ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని ఖరారు చేస్తాయి. ఈ రెండు నియోజకవర్గాలు కలిపి మొత్తం 50 వేలకు పైచిలుకు ఓట్లుండడంతో రెండు ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. నిజానికి మేళ్ళ చెరువు మరింత కీలకంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో అత్యంత సంపన్న మండలమైన మేళ్ళచెరువులో 9 సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. అయితే ఇంత రిచ్ మండలమైనా.. విద్యారంగంలో వసతుల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

2004 దాకా మేళ్ళ చెరువు కోదాడ నియోజకవర్గంలో వుండేది. టిడిపికి అప్పట్లో బాగా పట్టుండేది. 2009లో మేళ్ళ చెరువు మండలం హుజూర్‌నగర్లో కలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మండలంలో బాగా పట్టుండడంతో ఆయన విజయం సునాయసమైంది. 2014, 2019 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్‌కు మేళ్ళచెరువులో మంచి మెజారిటీ దక్కింది. అయితే ఇప్పుడు ఆయన సతీమణి పద్మావతి పోటీ చేస్తుండడంతో ఆయన ఓటు బ్యాంకు ఆమెకు మళ్లుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనికి గండి కొట్టేందుకు టిఆర్ఎస్ నేతలు ఈ మండలంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి ఇంటింటి ప్రచారంతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గులాబీ అభ్యర్థి ఆంధ్రా సెటిలర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు చింతపాలెం మండలంలో ఎక్కువ మంది ఆంధ్రా సెటిలర్లుండడంతో టిడిపి అక్కడ ఎక్కువ ఓట్లు పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. దీన్ని నివారించేందుకు టిడిపిని లోపాయికారీగా ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుండగా.. టిడిపి ఓట్లను తమ వైపునకు మరల్చుకునేందుకు టిఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు మండలాలే హుజూర్‌నగర్కు కాబోయే ఎమ్మెల్యే ఎవరో తేల్చనున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu