త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే అభ్యర్థి ఎవరు..? పార్టీ సూచన మేరకు టిక్కెట్ కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? వీరిలో లోకల్ ఎంత మంది నాన్ లోకల్ ఎంత మంది..? బరిలో నిలుస్తుంది అనుకున్న కొండ సురేఖ ఎందుకు కనీసం దరఖాస్తు చేసుకోలేదు.. మరి దరఖాస్తు చేసుకున్న వారికే కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందా..? దరఖాస్తు చేసుకోని వారి వైపు పార్టీ పెద్దలు మొగ్గుచూపుతారా? ఆసక్తిరేపుతోంది. పార్టీ అభ్యర్థి విషయంలో రాష్ట్ర నాయకుల తీరు ఒకలా.. స్థానిక జిల్లా నేతల అభిప్రాయం మరోలా ఉండటం విశేషం.
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున ఎవరిని బరిలో నిలపాలనేది కాంగ్రెస్ ముఖ్యులకు కత్తిమీద సాములా మారింది. రాష్ట్ర నాయకత్వం ఆలోచనలు ఒకలా… లోకల్ జిల్లా నాయకుల ఆలోచనలు మరోలా ఉన్నాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావించారు. అందుకోసం మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ప్రతిపాదించారు. అలాగే హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన దామోదర రాజనర్సింహ కమిటీ కూడా సురేఖ అభ్యర్థిత్వానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే కరీంనగర్ జిల్లా నేతల వాదన మాత్రం మరోలా ఉంది. హుజురాబాద్‌లో పార్టీ అభ్యర్థిగా నాన్‌లోకల్‌ను బరిలో నిలిపితే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందులోనూ వరంగల్‌కు చెందిన సురేఖను కరీంనగర్ జిల్లాలో పెట్టడం కరెక్ట్ కాదని జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ అభ్యర్థి విషయంలో ముఖ్యనేతలు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు.
జిల్లా నేతల సూచన మేరకు పార్టీ తరపున అభ్యర్థి ఎంపిక కోసం మరో కమిటిని వేశారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిపి కమిటీ వేశారు. అలాగే ఆశావహులు సైతం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 5వేల రూపాయల డీడీతో కలిపి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే సెప్టెంబర్ 5 వరకు గడువు పెట్టడంతో నిన్నటితో ముగిసింది. మొత్తంగా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 11 మంది హుజురాబాద్ నియోజకవర్గ నేతలు.. మిగతా ఏడు మంది నాన్‌లోకల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మొదటి నుంచి ప్రధానంగా చర్చ జరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోలేదు. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న వారిలో కేవలం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారంతా అనుకోకుండా తెరపైకి వచ్చిన వారున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి ఎంపిక కోసం వేసిన కమిటీ దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందా.. లేదా సమర్థత కోణంలో మరో నిర్ణయం ఉంటుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు. దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కల కమిటీ ఎవరి పేరును సూచిస్తుందనేది అంతుచిక్కడం లేదు..మరో వైపు అసలు హుజురాబాద్ లో ఎన్నిక అలస్యం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా ఇంకా టైం తీస్కుంటారో వేచి చూడాలి.
– అశోక్ భీమనపల్లి, టీవీ9 తెలుగు, హైదరాబాద్
Also Read..
TRS: గులాబీ గూటిలో అప్పుడే కుర్చీలాట.. నేనంటే నేనంటున్న తాజా.. మాజీలు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..