తెలంగాణలో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం రేవల్లి మండలంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రికి ఓ అపురూప దృశ్యం కనిపించింది.
రేవల్లి మండలం గొల్లపల్లి సమీపంలో రేవల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్తున్న చీర్కపల్లికి చెందిన పట్టభద్రురాలు తలారి మహాలక్ష్మి ఎదురై మంత్రి వాహనశ్రేణిని గమనించి ఆపింది. మహాలక్ష్మిని గమనించిన మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం దిగిన వెంటనే తన మూడునెలల పసికందును చేతులలో పెట్టింది మహాలక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నారని మంత్రి ప్రశ్నించగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నాను అని చెప్పడంతో మంత్రి గారు ఆశ్చర్యపోయి అభినందించారు.
మూడు నెలల చంటి పాప ఉన్నా భాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహాలక్ష్మి అందరికీ ఆదర్శం అని, పౌరులుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్థిని చాటిచెప్పాలని అన్నారు.
బద్దక ఓటర్లకు ఆదర్శంగా నిలిచిన నవ వధువు.. ఓటేసిన తర్వాతే పెళ్లిపీటలెక్కిన ఫిర్దోస్ బేగం