Om Prakash Chautala: ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కానీ ఇప్పటి వరకు పదోతరగతి పరీక్ష మాత్రం పాస్ కాలేదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అందుకే కాబోలు 86 ఏళ్లు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడులా ఇంకా పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షకు హాజరవుతున్నాడు. అతడు ఎవరో కాదు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా. 2013 జేబీటీ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో కోర్టు ఆయనకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో హరియాణా ఓపెన్ బోర్డు కింద చౌతాలా 12వ తరగతి పరీక్షలు రాశారు. అయితే ఆయన 10వ తరగతి ఇంగ్లీషులో పాస్ మార్కును సాధించలేకపోయారు. అది పాస్ అయ్యే వరకు 12వ తరగతి ఫలితాలను బోర్డు నిలిపివేసింది. దానికోసమే ఆయన ఇంగ్లీషు పరీక్షను రాయాల్సి వచ్చింది. కాగా అనారోగ్యం కారణంగా పరీక్ష రాసేందుకు సహాయకుడి కోసం ఆయన అభ్యర్థన పెట్టుకున్నారు. బోర్డు నుంచి అనుమతి వచ్చిన అనంతరం ఆయన పరీక్షను పూర్తి చేశారు. అయితే ఆయన పరీక్షా కేంద్రానికి వచ్చిన క్రమంలో మీడియా ఆయనతో మాట్లేందుకు ప్రయత్నించగా..‘ నేను విద్యార్థిని. నో కామెంట్స్’ అని వ్యాఖ్యానించడం విశేషం.
ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4 శాతం మార్కులు సాధించారాయన.