Early Elections: ముందస్తు ముచ్చట.. ఎవరికి లాభం… మరెవరికి నష్టం..?

|

Mar 18, 2022 | 5:47 PM

ముందస్తు ఎన్నికల వల్ల ఎవరికి లాభం, మరెవరికి నష్టం. అసలు ముందస్తు ఉంటుందా లేకపోతే ఒకేసారి జమిలి ఎన్నికలకు వెళతారా అనే చర్చా సాగుతోంది. గల్లీల్లోనే కాదు ఢిల్లీలోను ఇదే తీరు. ఈ నేపధ్యంలో అసలు ముందస్తు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సార్లు జరిగాయి. గత చరిత్ర ఏం చెబుతోంది.

Early Elections: ముందస్తు ముచ్చట.. ఎవరికి లాభం... మరెవరికి నష్టం..?
Early Elections
Follow us on

తెలుగునాట ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు. ఏ నలుగురు రాజకీయ నాయకులు కలిసి కూర్చున్నా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి. ఎవరు గెలుస్తారో. మరెవరు ఓడతారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తాడా. జగన్ కి మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడా. చంద్రబాబు సంగతేంటి. పవన్ కల్యాణ్, బీజేపీలు ఏం చేస్తాయో. రేవంత్ రెడ్డి. బండి సంజయ్ లు దూకుడు ఎంత వరకు పని చేస్తుంది. కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, లెక్కలు, కూడికలు, తీసివేతలు ఉంటున్నాయి. వీటి వల్ల ఎవరికి లాభం, మరెవరికి నష్టం. అసలు ముందస్తు ఉంటుందా లేకపోతే ఒకేసారి జమిలి ఎన్నికలకు వెళతారా అనే చర్చా సాగుతోంది. గల్లీల్లోనే కాదు ఢిల్లీలోను ఇదే తీరు. ఈ నేపధ్యంలో అసలు ముందస్తు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సార్లు జరిగాయి. గత చరిత్ర ఏం చెబుతోంది. వాస్తవం ఏంటో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…

ముందే పసిగట్టారా…

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దక్షిణాదిపైనే మా దృష్టి అన్నారు భారతీయ జనతా పార్టీ అధినేత నడ్డా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆ పార్టీ దూకుడుగా వెళుతోంది. సభలు, సమావేశాలు, వ్యూహాత్మక ఆందోళనలు, నిరసనలు, అరెస్టులతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ 22, 2021 ఢిల్లీలో జరిగిన తెలంగాణ బీజేపీ నేతల భేటీలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని ప్రస్తావించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని తమ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారాయన. ముందస్తు ఎన్నికలు ఉంటాయని ముందే సంకేతాలిచ్చిన తొలి వ్యక్తి ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం. మార్చి5, 2022న ఆలంపూర్ లో చెప్పిన గులాబీ నేత మాటనే మిగతా పార్టీలు ప్రస్తావించడం హాట్ టాపికైంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కాస్తంత ముందుకెళ్లారు. కర్నాటకతో పాటే తెలంగాణ ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతున్న తీరు ఆసక్తికరమే. ముందస్తు ఎన్నికలు లేవయ్యా బాబు. ఇదేదో కావాలని ప్రచారం చేస్తున్నారంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. వాస్తవం ఏదైనా ఎవరికి వారే కార్యరంగంలోకి దూకి ప్రజల నాడి పట్టే పని చేస్తుండటం ఉత్కంఠను పెంచుతోంది.

గత చరిత్ర….

తెలుగునాట నాలుగుసార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు సార్లు అధికార పార్టీకి పరాజయం ఎదురుకాగా..మరోసారి గెలిచాయి. టీడీపీ రెండు సార్లు ఓడితే.. కాంగ్రెస్ ఒకసారి అదే బాట పట్టింది. ఓటమి చరిత్రను తిరగరాసింది మాత్రం కేసీఆర్ నే.

1983లో భంగపడిన కోట్ల…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. 1982 మార్చి29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు సినీనటుడు నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్). తెలుగుజాతి చరిత్రను తిరగరాస్తానని కాంగ్రెస్ పాలనకు అంతం పలుకుతానని శపథం చేశాడు. తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే అంకితమని ప్రతినబూనాడు. ఇది కాంగ్రెస్ ను ఆలోచనలో పడేసింది. ఎన్టీఆర్ కు పూర్తి సమయం ఇవ్వకూడదనే ఆలోచన చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఫలితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. మాములుగా అయితే 1983 ఆగస్టులో జరగాలి అసెంబ్లీ ఎన్నికలు. కానీ 1983 జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముందస్తు వ్యూహం బెడిసికొట్టింది. ఎన్టీఆర్ జనంలోకి వెళ్లే సమయం లేదని అంచనా వేసినా 201 స్థానాలతో టీడీపీకి పట్టం కట్టారు ప్రజలు. కాంగ్రెస్ కు 60 సీట్లే వచ్చాయి. బీజేపీ-03 స్థానాల్లో సిపిఐ-04 సీట్లలో, సిపిఎం-05 సీట్లు, జనతా పార్టీ ఒక సీటులో గెలిచాయి. ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది టీడీపీ. ఆ ఆ ఏడాది దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. కానీ ఏపీలో మాత్రం విజయం సాధించలేకపోయింది. అప్పటి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైంది తెలుగుదేశం పార్టీ.

1990లో బెడిసికొట్టిన ఆత్మవిశ్వాసం…

తెలుగుజాతి ఆత్మ గౌరవ నినాదం అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్నారు. 1985లో 202 సీట్లు గెలిచిన టిడిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. 1990 మార్చి వరకు ప్రభుత్వానికి సమయం ఉన్నప్పటికీ నాలుగు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఓటమి తప్పలేదు. 241 సీట్లల్లో పోటీ చేసి 74 స్థానాలే సంపాదించింది. సిపిఐ-08, సిపిఎం-06 సీట్లలో గెలవడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ 287 స్థానాలకు పోటీ చేసి 181 సీట్లు హస్తగతం చేసుకుంది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఐదు సీట్లు రావడం విశేషం.

2004లో పనిచేయని సానుభూతి…

2003 అక్టోబర్‌ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్‌ క్లైమోర్ మైన్స్ పేల్చి దాడి చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళుతుండగా చంద్రబాబుపై ఈ దాడి జరిగింది. తీవ్రగాయాలతో బయటపడ్డారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా ఇది పెద్ద సంచలనమైంది. చంద్రబాబు పై సానుభూతిని తీసుకువచ్చింది. తనకు ఇది కలిసి వస్తుందని బలంగా నమ్మారు చంద్రబాబు. అందుకే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది తెలుగుదేశం పార్టీ. 2004 వరకు అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబర్ లోనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. నక్సలైట్ల దాడితో సానుభూతి వస్తుందని అంచనా వేసినా ఆ వ్యూహం పని చేయలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. 2004 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 267 సీట్లల్లో పోటీ చేయగా…47 సీట్లు దక్కించుకుంది. మరోవైపు కాంగ్రెస్ 234 స్థానాల్లో పోటీ చేసి 185 సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ 37.59 శాతం ఉంటే..కాంగ్రెస్ కు 38.56 శాతం వచ్చాయి. బీజేపీకి -02, టీఆర్ఎస్ కు-26, సిపిఐ-06 సీట్లు, సిపిఎం-09 సీట్లు, ఎస్పీ ఒకటి, జనతా పార్టీ-02, ఎంఐఎం-04, బీఎస్పీ1, స్వతంత్రులు11 సీట్లల్లో గెలిచారు. మొత్తంగా చంద్రబాబు ముందస్తు మాట కాంగ్రెస్ కు బాట అయింది.

2018లో కొత్త చరిత్ర

తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చే వ్యూహ రచన చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలుగురాష్ట్రాల్లో గత ముందస్తు ఓటముల చరిత్రను పట్టించుకోలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన మూడు సార్లు అధికార పార్టీ పరాజయం పాలైన సంగతిని పక్కన పెట్టారు. తామే అధికారంలోకి వస్తామని బలంగా నమ్మారు. మాములుగా అయితే 2019 ఏప్రిల్‌-మేలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ 2018 సెప్టెంబర్‌లోనే అసెంబ్లీ రద్దు చేశారు సిఎం కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా గతంలో కంటే భారీ విజయం నమోదు చేసుకోవడం విశేషం. ఆ ఎన్నికల్లో 119 సీట్లకు గాను 88 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ 99 సీట్లల్లో పోటీ చేసి 19 సీట్లే దక్కించుకుంది. ఇక బీజేపీకి 1 సీటు రాగా…టీడీపీ-02, ఎంఐఎం-07, పార్వర్డ్ బ్లాక్ ఒకచోట, ఇండిపెండెంట్ మరో సీటులో గెలిచారు. అధికారంలోకి వచ్చిన గులాబీ గుర్తు పార్టీకి 46.87 శాతం ఓటు షేర్ రాగా…హస్తం గుర్తు పార్టీకి కేవలం 28.43 శాతమే వచ్చింది.

అధికార పార్టీలకు ముందస్తు ఎన్నికలు గండమే అని గత చరిత్ర చెబుతోంది. కానీ కేసీఆర్ ఈ చరిత్రను తిరగరాశారు కాబట్టి ఈ సారి ముందుకే వెళతారా లేదా అనేది వేచి చూడాలి. ఇంకోవైపు ఏపీలోను ముందస్తు మంత్రాంగం చర్చ జోరుగానే సాగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లాలని సిఎం జగన్మోహనరెడ్డి సూచించడం ముందస్తు సంకేతాలంటున్నాయి విపక్షాలు. విషయం ఏదైనా ముందస్తు వస్తే ఎవరి పుట్టి మునుగుతుందోనన్న చర్చకు పుల్ స్టాప్ మాత్రం పడటం లేదు.

కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, 
రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.