ఇదేనా దేశభక్తి..? పింగళి వెంకయ్యకు “భారతరత్న” ఎందుకు ఇవ్వడం లేదు?
పింగళి వెంకయ్య.. తెలుగువారిని గర్వపడేలా చేసిన మహనీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా.. ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం.. జయంతి ,వర్దంతి వంటి కార్యక్రమాల్లో స్మరించుకోవడం తప్ప.. ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. పింగళికి దక్కిన గుర్తింపు ఎంత అంటే.. స్వయంగా భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా ఆయన పేరు కనిపించదు. పైగా 1921 సంవత్సరంలో ఓ […]
పింగళి వెంకయ్య.. తెలుగువారిని గర్వపడేలా చేసిన మహనీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా.. ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం.. జయంతి ,వర్దంతి వంటి కార్యక్రమాల్లో స్మరించుకోవడం తప్ప.. ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. పింగళికి దక్కిన గుర్తింపు ఎంత అంటే.. స్వయంగా భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా ఆయన పేరు కనిపించదు. పైగా 1921 సంవత్సరంలో ఓ ఆంధ్రా యువకుడు జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీకి చూపించారని మాత్రం పేర్కొన్నారు. దీన్ని బట్టి మన ప్రభుత్వాలు.. ఓ గొప్ప దేశభక్తుడి పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి 1921లో జాతిపతి మహాత్మా గాంధీ సూచన మేరకు బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశంలో పింగళి.. త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీకి ఇచ్చారు. ఒకే జెండాతో బ్రిటీష్ వారికి నిద్రపట్టకుండా చేశారు. అటువంటి జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి భారతీయుడు.. రొమ్ము గుద్దుకుని చెప్పగల ధైర్యాన్నిచ్చిన జెండా మన జాతీయ జెండా. మన దేశభక్తిని చాటి చెప్పేది మన జెండా. అలాంటి జెండా రూపశిల్పికి ఇచ్చిన గౌరవం ఏమీ లేదు. ఏదో ఇచ్చామన్న పేరుకు పద్మ అవార్డును ప్రకటించి చేతులు దులుపుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పింగళి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఆ తర్వాత 2011లో ఏపీ ప్రభుత్వం పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఓ తీర్మానం కూడా చేసింది. కానీ అది ఏమైందో ఇప్పటికీ ఎవరీకీ తెలియదు.
భారతరత్న పురస్కారం అనేది పలు రంగాల్లో సేవ చేసిన వారికి గుర్తింపుగా ఇస్తారు. 1954లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దీనిని స్ధాపించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మంది వరకు దీన్ని అందుకున్నారు. దీన్ని ప్రకటించే ముందు ఈ జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత దీన్ని ప్రకటిస్తారు. ఈ పురస్కారంతో దేశంలో 7వ స్ధాయి గౌరవం లభిస్తుంది. అంటే దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి మొదలు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తుల తర్వాత భారతరత్న పురస్కారం పొందినవారు తగిన గౌరవం లభిస్తుంది.
భారతరత్న పురస్కారాన్ని 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి మాత్రేమే ఇచ్చేవారు. అయితే 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి “మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా” అనే పదాన్ని చేర్చడంతో అన్ని రంగాల వారికి దీన్ని ప్రదానం చేస్తున్నారు. అయితే మరణించినవారికి దీన్ని ప్రదానం చేసేవారు కాదు. అయితే 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. అలా పొందినవారిలో తొలి వ్యక్తి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఒకే ఒక్క సందర్భంలో ఈ పురస్కారాన్ని వెనక్కి తీసుకున్నారు. అది కూడా స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌కు ప్రకటించి.. కొన్ని సాంకేతిక కారణాలతో వెనక్కి తీసుకున్నారు.
ఇతర దేశస్తులకు సైతం భారతరత్నను ప్రదానం చేసిన దాఖలాలున్నాయి. వీరిలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా, మథర్ తెరిస్సా ఉన్నారు. ఇటీవల కాలంలో క్రీడల్లో సచిన్ టెండూల్కర్‌కు కూడా భారతరత్నతో సత్కరించారు. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సైతం అది దక్కింది. ఇంతమందికి ఈ పురస్కారం లభించినా.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని వణికించిన జెండా, జాతియోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన జెండా మన మూడు రంగుల జెండా. జమ్ము కశ్మీర్‌లో నిన్నమొన్నటి వరకు రెండు జెండాలు ఎగిరినా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రభుత్వ కార్యాలయాలపై రెపరెపలాడుతోంది మన జెండా. ప్రతి గుండెలో దేశభక్తిని నింపుతున్న త్రివర్ణ పతాక రూపశిల్పిని మర్చిపోవడం సహేతుకంగా అనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య సేవల్ని గుర్తించి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరముందనే వాదన బలపడుతోంది.