ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, ఆత్మ పరిశీలన చేసుకున్నా ఫలితం ఉండేనా ?

| Edited By: Phani CH

May 09, 2021 | 4:34 PM

ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సమావేశం కానుంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇక మళ్ళీ మరో ఆత్మపరిశీలనకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, ఆత్మ పరిశీలన చేసుకున్నా ఫలితం ఉండేనా ?
Sonia Gandhi
Follow us on

ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సమావేశం కానుంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇక మళ్ళీ మరో ఆత్మపరిశీలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పనితీరు అధ్వాన్నంగా ఉందని, ఫలితాలు ఇలా ఉంటాయని తాము ఊహించలేదని సోనియా అన్నారు. అందువల్లే సమగ్ర సమీక్షకు ఈ నెల 10 న పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆమె ఈ నెల 7 న జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు, ఈ ఫలితాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందన్నారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనువుగా మలచుకోవడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. కేరళలో ఎల్ డీ ఎఫ్, అస్సాంలో బీజేపీ కూటమి విజయం సాధించాయి. పుదుచ్చేరిలో రెండు సీట్లను మాత్రం కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పార్టీకి కాస్త ఆశాకిరణం మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలే.. ఆ రాష్ట్రంలో డీఎంకేతో పొత్తు పెట్టుకుని గండం నుంచి బయటపడగలిగింది. అయితే స్వయానా సోనియా కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బెంగాల్ ఎన్నికల ప్రచారం పై ఆసక్తి చూపలేదు.. కోవిద్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ఆయన రెండు ర్యాలీలకు మాత్రమే హాజరై ఇక ఇంటి పట్టునే ఉండిపోయారు. కేరళలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నా అస్సాం వైపు దాదాపు దృష్టి పెట్టలేదు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పార్టీ నాయకత్వంపై కాస్త ఘాటుగానే స్పందించారు. ట్విటర్, ఫేస్ బుక్ నుంచి నాయకత్వం బయట పడాలన్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మరో నేత శశిథరూర్ వంటి నేతలు కూడా ఇటువైపు చూడ్డమే మానేశారు. కపిల్ సిబల్, ఆనంద్ శర్మ లాంటి వారు ఇదివరకటి మాదిరే పార్టీ నాయకత్వం మారాలని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి చెప్పుకోకపోవడమే ఉత్తమం.ఈ పరిస్థితుల్లో రేపటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాలి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మిర్చి కొని ఏడాది కాలంగా త‌ప్పించుకు తిరుగుతున్న వ్యాపారుల‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు.. ఏం చేశారంటే..

Coronavirus Curfew: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మే 17 వరకు కరోనా కర్ఫ్యూ..