
ఏపీ పర్యటనలో భాగంగా అమరావతికి చేరుకున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబుతో ఆయన చర్చించారు. రాష్ట్రంలోని వివిధ వాణిజ్యపరమైన అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపును కోరుతూ కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు సీఎం చంద్రబాబు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్లకోసం 150 కోట్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొనుగోలు జరుపుతుందని కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు. ఈ మొత్తంలో కేంద్రం 150 కోట్లు భరించాలని కేంద్రమంత్రిని కోరారు.
పామాయిల్ ఉత్పత్తికి సరైన ధర రావడంలేదన్న చంద్రబాబు, కేంద్రం పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గించడమే ఇందుకు కారణమని పీయూష్ గోయల్ దృష్టికి తెచ్చారు. దిగుమతి సుంకం తగ్గింపు కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు ప్రతిబంధకంగా మారుతుందని చంద్రబాబు వివరించారు. అక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో చర్చలు జరిపి రైతులకు మేలుజరిగేలా చూడాలని కోరారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్రమంత్రిని కోరారు.
అటు పొగాకు రైతులు పొగాకు మద్దతు ధర పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రైతుల సమస్యలు, వాణిజ్య పంటల ఎగుమతులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. గుంటూరులోని పొగాకు బోర్డు అధికారులతో జరుగుతున్న భేటీలో ఈ విషయంపై కూడా కేంద్రమంత్రి ఒక ప్రకటన చేస్తారని రైతులు భరోసాతో ఉన్నారు.
రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలు, దిగుబడులు, మద్దతు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ఎగుమతులు వంటి అంశాలపై అధికారులు, టొబాకో బోర్డు స్టేక్ హోల్డర్స్‌తో కలసి కేంద్రమంత్రి సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..