
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకి ‘సంకల్ప్ పత్ర్’ అనే పేరు పెట్టారు.
మేనిఫెస్టో విడుదలకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. ప్రధాని మోదీ ఐదేళ్లలో అద్భుతమైన పాలన అందించారని అన్నారు. ప్రస్తుతం దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది అని.. ప్రపంచంలో ఆర్ధిక శక్తిగా భారత్ సత్తా చాటుతోందని అన్నారు. సమాఖ్య స్పూర్తితో పనిచేస్తూ.. ప్రజల ఆకాంక్షలు బీజేపీ నెరవేర్చిందని అన్నారు. అసాధ్యాలను ప్రధాని మోదీ సుసాధ్యం చేశారని.. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నది. ఈ నేపథ్యంలో 75 హామీలతో ఈ మేనిఫెస్టోను తీసుకొచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. 2022 లోపు తాము ఇచ్చిన ఈ 75 హామీలు నెరవేరుస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో నవభారత నిర్మాణానికి నాంది పలుకుతుంది అని అన్నారు. భారత్ ఆర్థిక శక్తిగా నిలుస్తోందని… ప్రధాని మోదీ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని అన్నారు. దేశభద్రతపై బాధ్యతాయుతంగా పనిచేశామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించామని అన్నారు. చాలామంది అభిప్రాయాలను సేకరించామని… ఆచరణ సాధ్యమైన హామీలనే బీజేపీ ఇస్తుందని అన్నారు.
ఇక రామ మందిర నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ.. గత ఎన్నికల్లో చేసిన హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సామరస్యంగా మందిర నిర్మాణం పూర్తి చేస్తాం అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అటు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 (ఎ)లను రద్దు చేస్తామన్న తమ మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి రైతులకు రూ.6 వేల పెట్టుబడి సాయం చేస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.