కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 100 రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నిర్ణయం మంచిదేనని… ఆచరణ బాగోలేదని కాంగ్రెస్ వాళ్లు చెప్పిన విషయం గుర్తుచేశారు. 1950 నుంచే 370 ఆర్టికల్ రద్దు చెయ్యాలంటూ పోరాడుతూ వచ్చామని పేర్కొన్నారు. తమపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. 1949లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆర్టికల్ 370ని ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ నెహ్రూ మాట కోసం రాజ్యాంగంలో ఎలా చొప్పించారని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు పార్టీ ప్రయోజనాల కోసం కాదన్నారు. దేశం కోసం, కాశ్మీరీ ప్రజల కోసం అని గుర్తు చేశారు.వేరే వాళ్లకు కూడా వంద రోజులు పూర్తయ్యాయని… అమరావతి వైపు వెళ్లాలో… ఎటెళ్లాలో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని రాంమాధవ్ ఎద్దేవా చేశారు.