MP Komatireddy Venkatreddy Sensational Comments: హుజురాబాద్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. ఘోర పరాభవంపై నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఉప ఎన్నిక ఓటమిపై అంతర్మథనానికి బదులు అంతర్యుద్ధమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చివరికి ఓటమికి కారణాలను తేల్చేందుకు ఓ కమిటీని వేయాలని డిసైడ్ అయినా.. సీనియర్ నేతలు పీసీసీ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియా ముందు కామెంట్స్ చేయకూడదని హెచ్చరించారు ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.
అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రచ్చ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొరకరాని కొయ్యగా మారారు. సొంత పార్టీ నేతలపై నిత్యం విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పరువును రోడ్డున పెడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మరోమారు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ విమర్శలు పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడే కాదని వందేళ్ల చరిత్ర ఉందన్నారు. పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యాక తననను ఎప్పుడు ఏ మీటింగ్‌కి పిలవలేదని మండిపడ్డారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 13 నెంబర్‌గా పెట్టడంపై కోమటిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న తమను డమ్మీలను చేయాలని చూస్తున్నారన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. సొంత ఎజెండా పెట్టుకొని సొంత పాటలు పెట్టుకొని ఈవెంట్లు చేస్తే పార్టీ బలోపేతం కాదన్న కోమటిరెడ్డి.. ఒక్క ప్రేమ్ సాగర్ మాత్రమే కాదు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలతో సహా అందర్నీ లెక్కచేయకుండా నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి సారి అవమానపరుస్తున్నారు. కానీ, పార్టీకి నష్టం కలిగితే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు.
హుజురాబాద్ నా అవసరం లేదనుకునే క్రికెట్ చూడడానికి వెళ్లాను 33 సంవత్సరాల కాంగ్రెస్ కెరీర్‌లో హుజురాబాద్ ఎన్నిక షాక్ కి గురిచేసిందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సిరియస్‌గా తీసుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఒక్కసారి అయిన అక్కడ సభ పెట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టీడీపీ రక్తం నింపుతున్నారన్న ఆయన.. పీసీసీలో మొత్తము వలస వచ్చిన టీడీపీ నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్లు అంతా పార్టీ నుంచి వెళ్లిపోతే, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై, మణిక్యం ఠాగూర్, హుజురాబాద్ ఫలితంపై పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియాగాంధీకి వివరిస్తానన్నారు. కాంగ్రెస్ తెలంగాణ కంటే ఆంధ్రలోనే పుంజుకుంటోందన్నారు. పార్టీ బలోపేతంపై అధిష్టానంతో చర్చిస్తానన్నారు.
Read Also… Viral Video: నాతోపాటు నా బొజ్జి బొమ్మకు కూడా టెంపరేచర్ చెక్ చేయండి.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో..