AP Govt Declares Holiday : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 7, 8 తేదీల్లో పరిషత్ ఎన్నికల సందర్భంగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇదిలా ఉంటే.. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. వాహనాలు వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని.. ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్‌లు నిర్వహించాల్సి వన్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులిస్తామని స్పష్టం చేశారు.
పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను అధికారుల వద్దకు చేర్చే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన ఇంక్ మార్క్ ఇంకా పోయి ఉండదు కాబట్టి పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.