Somu Veerraju Comments: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాదకరమన్నారు. పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.
అలాగే టీడీపీ ఆఫీసులపై జరిగిన వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలాంటి దాడులు రాష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు. అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా మారిందని.. ఇలాంటి పోకడలను వెంటనే నియంత్రించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిది కాదని వెల్లడించారు. ఇలాంటి దాడులు అరాచకాలకు దారి తీస్తాయని.. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఈ దాడులకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాధకరం.పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను @BJP4Andhra చాలా తీవ్రంగా ఖండిస్తోంది.ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై @ysjagan గారి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని BJP AP డిమాండ్ చేస్తున్నది. pic.twitter.com/le6tJckvWh
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) October 19, 2021