
World Tourism Day 2023: భాగస్వామి లేదా పార్ట్నర్‌తో పర్యటనకు వెళ్లిన సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదు. అది హనీమూన్ అయినా కాజ్యూవల్ టూర్ అయినా ఆయా పొరపాట్లు చేయకపోవడమే మీ బంధానికి మంచిది. ఇంతకీ పర్యటన విషయంలో చేయకూడని ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సెల్ఫీలతో బిజీ: ఈ మధ్య కాలంలో సెల్ఫీ క్రెజ్ బాగా పెరిగిపోయింది. తింటున్నా, తాగుతున్నా.. ఆఖరికీ నడుస్తున్నా కూడా సెల్ఫీ అంటూ నెట్టింట ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కొందరు. అయితే కొందరు ప్రత్యేక సందర్భాల జ్ఞాపకాలను గుర్తిండిపోయేలా ఫోటోల్లో బంధించాలని ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ఇలా భాగస్వామితో పర్యటనకు వెళ్లినప్పుడు చేయడం మంచిది కాదు. పర్యటన సమయంలో కూడా ఫోటోలతో బిజీ బిజీగా గడిపితే మీ భాగస్వామికి కోపం, చిరాకు కలిగే ప్రమాదం ఉంది. అది బంధానికి ఏ మాత్రం కూడా మంచిది కాదు.

ప్రియారిటీస్‌ని లెక్కచేయకపోవడం: ట్రిప్ సమయంలో దంపతులు తమ ప్రియారిటీస్‌ని పరస్పరం గౌరవించుకోవాలి. భాగస్వామికి ఆసక్తి లేని విషయాల కోసం ఒత్తిడి చేయకూడదు. ఇలా చేస్తే దాంపత్య జీవితంలోకి సమస్యలను ఆహ్వానించుకున్నట్లే.

తప్పుడు ప్రదేశాలు: పర్యటనకు వెళ్లాలనుకున్న ప్రదేశాల గురించి, వెళ్లకముందే తెలుసుకోవడం చాలా మంచిది. ఆహారం, భద్రతతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఇవేం తెలుసుకోకుండా టూర్‌కి వెళ్తే.. వెళ్లిన చోట ఎదురయ్యే ఇబ్బందులు దాంపత్య జీవితంలో సమస్యలకు కారణం కాగలవు.

సీజన్‌లో వెళ్లడం: కొన్ని రకాల ప్రదేశాలను సందర్శించేందుకు ప్రత్యేక సీజన్ ఉంటుంది. అయితే భాగస్వామితో పర్యటనకు వెళ్లాలనుకుంటే సీజన్‌లో వెళ్లకపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే జంటగా పర్యటనకు వెళ్లినప్పుడు సమయాన్ని హాయిగా, ప్రశాంతంగా గడపాలని అంతా అనుకుంటారు. అదే సీజన్‌లో వెళ్తే.. అక్కడ ఉంటే రద్దీ, వస్తువుల ఖరీదు వంటి పలు కారణాల వల్ల మీరు మీ పర్యటనను ఆస్వాదించలేరు.