
అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, కాపర్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎండిన అత్తి పండ్లలో తాజా అత్తి పండ్ల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది. 100 గ్రాముల ఎండిన అత్తి పండ్లలో 9.8 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. అయితే తాజా అత్తి పండ్లలో 2.9 గ్రాములు మాత్రమే ఉంటుంది.

ఇంట్లో పాలు, అంజీర్ పానీయం ఎలా తయారు చేయాలి - ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయాన్ని నిద్రించే ముందు తీసుకోవాలి. దీనికోసం ఒక గ్లాసు పాలను వేడిచేయాలి. దానిలో 3 ఎండిన అంజీర్ పండ్లను వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. దీనిలో 2-3 కుంకుమపువ్వులను కూడా జోడిస్తే మేలు.

ముఖ్యంగా చలికాలంలో ఈ డ్రింక్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా అరకప్పు వేడి నీటిలో అంజీర పండ్లను నానబెట్టి.. అరకప్పు పాలలో వాటిని వేసి మరిగించి తాగొచ్చు.

అత్తి పండ్లను వెచ్చని పాలతో కలిపి నిద్రించే ముందు తాగితే చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తి పెంచడంతోపాటు.. ఎముకలు, దంతాల సమస్యలను దూరం చేస్తుంది. దీంతోపాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా బలంగా మారుస్తుంది. వాపును, కీళ్లు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

పాలలో అంజీర్‌ను కలిపితే.. ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ పానీయంలో ఆరోగ్యకరమైన పాల ప్రోటీన్, కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వేడి పానీయం ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనే మూలకాల ఉనికితో నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.