
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి జొన్నపిండి దోసెలు ఒక అద్భుతమైన ఎంపిక. జొన్నపిండితో ఈ రెసిపీ నిముషాల్లోనే చేసుకోవచ్చు. దీనిని టిఫిన్, డిన్నర్ ఇలా రెండింటికీ అనుకూలంగా తీసుకోవచ్చు. జొన్నపిండిలో అధిక పోషక విలువలు ఉంటాయి. ఇది ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్నపిండి సహాయపడుతుంది.

జొన్న పిండి దోస కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్నపిండి, రెండు కప్పులు నీళ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, దోసెలు కాల్చడానికి నూనె, కారం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా ఒక మిక్సి బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు జొన్నపిండిని వేయండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను చేర్చి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచండి. ఈ విధంగా నానబెట్టడం వల్ల పిండి మెత్తబడి, దోసెలు చక్కగా వస్తాయి. పది నిమిషాల తర్వాత, పిండిని మరోసారి కలుపుకుని, ఇంకొక కప్పు నీళ్లను చేర్చండి. జొన్నపిండి దోసెల పిండి సాధారణ బియ్యం దోసెల పిండి కంటే పలుచగా ఉండాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, తురిమిన అల్లం, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకును సన్నగా తరిగి వేయడం వల్ల దోసెల రుచి మరింత పెరుగుతుంది. స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టి, రెండు లేదా మూడు చుక్కల నూనె వేసి టిష్యూ లేదా ఉల్లిపాయ ముక్కతో పెనం మొత్తాన్ని తుడిచేయండి. ఇది దోసెలు అతుక్కోకుండా, చక్కగా రావడానికి సహాయపడుతుంది. పిండిని వేయడానికి ముందు, అడుగు నుండి బాగా కలుపుకోవాలి.

పెనంపై మధ్యలో పిండి వేసి స్ప్రెడ్ చేయకుండా, పెనం అంచుల నుండి పిండిని పోయాలి. పిండి పోసిన తర్వాత దానిపై కొద్దిగా కారం పొడి చల్లి, ఒక స్పూన్ నెయ్యి వేసి సమానంగా పరచండి. ఆ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్, కొత్తిమీరను చల్లాలి. గ్యాస్ మంటను తక్కువ నుండి మధ్యస్థ మంటకు సర్దుబాటు చేసి, దోసె బంగారు రంగులోకి మారే వరకు కాల్చండి. అంచులు లేతగా మారినప్పుడు, దోసెను మధ్యలోకి ఫోల్డ్ చేయాలి.రెండు వైపులా బంగారు రంగులోకి మారేవరకు కాల్చుకుని, వేడివేడిగా తినండి.