
5 - 12 ఏళ్ల వయస్సున్నవారు: పిల్లల ఎదుగుదలకు, శారీరక దృఢత్వానికి నడక చాలా అవసరం. ఈ వయసు పిల్లలు రోజుకు కనీసం 60 నిమిషాలు నడవాలి. కేవలం నడకే కాకుండా ఆటపాటల ద్వారా కూడా ఈ సమయాన్ని పూర్తి చేయవచ్చు.

13 - 19 ఏళ్లు: చదువుల ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి టీనేజర్లకు నడక మేలు చేస్తుంది. వీరు రోజుకు 45 నుండి 60 నిమిషాల పాటు చురుగ్గా నడవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా, ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

20 - 40 ఏళ్లు: ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండే ఈ వయసు వారు ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు మితమైన వేగంతో నడవాలి. దీనివల్ల రక్తపోటు తగ్గడం, కండరాల బలం పెరుగడంతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

60 ఏళ్ల లోపు వారు: వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలను నడకతో చెక్ పెట్టవచ్చు. రోజుకు 30 నుండి 40 నిమిషాలు నడవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

60 - 75 ఏళ్లు: ఈ వయసులో శరీరాన్ని అతిగా శ్రమ పెట్టకూడదు. సమతుల్యత కోల్పోకుండా ఉండటానికి రోజుకు 20 నుండి 30 నిమిషాలు మితమైన వేగంతో నడిస్తే సరిపోతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సాధారణంగా భోజనం తర్వాత తేలికపాటి నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. నెమ్మదిగా నడవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. సోమరితనం తగ్గుతుంది. ఇది క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల బరువును నియంత్రించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.