ప్రపంచంలో ప్రతిచోటా వివాహానికి సంబంధించిన వివిధ రకాల ఆచారాలు ఉన్నాయి.మనదేశంలో ఉత్తర భారత దేశంలోని పెళ్లి సమయంలో చెప్పులు దొంగిలించే ఆచారం ఉంది. స్కాట్లాండ్‌లో అయితే వధువు సహనశక్తిని అనేక రకాలుగా పరీక్షిస్తారు. అయితే పెళ్లి చేసుకునే యువకుడిని చేతులతో కొట్టి పరీక్షించే ఆచారం ఉన్న దేశం కూడా ఉందని మీకు తెలుసా? ఈ వింత ఆచారం గురించి తెలుసుకుందాం
వాస్తవానికి, దక్షిణ కొరియాలో వివాహం సమయంలో.. వరుడు తన పౌరుషాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. తన కుటుంబాన్ని , పెళ్లి తర్వాత భార్యని సంతోషంగా చూసుకునే ఓర్పు నేర్పు అతనిలో ఉందొ లేదో తెలుసుకునేందుకు ఓ ఆచారాన్ని పాటిస్తారు. ఆచారం గురించి తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దక్షిణ కొరియాలో వరుడిని చెక్కతో కట్టి తలకిందులుగా వేలాడదీసి అరికాళ్లపై కర్రలతో కొడతారు కొందరు . అంతేకాదు ఈ సమయంలో పెళ్లికొడుకును స్నేహితులు కొందరు చెప్పులు, బూట్లతో కొడతారు.
ఈ వింత ఆచారం వెనుక ఓ రీజన్ కూడా చెబుతున్నారు స్థానికులు. ఈ ఆచారంలో ఉత్తీర్ణులైన వరులకు జీవితంలో ఎటువంటి సమస్య ఉండవని ప్రజలు నమ్ముతారు. తమ కొత్త భార్యను ఇంటికి తీసుకుని వెళ్లాలంటే ఈ బాధను భరించాల్సిందే. వరుడు లేదా స్నేహితుల కుటుంబం, వరుడి బూట్లు తొలగించి, అతని చీలమండలను తాడుతో కడతారు. అనంతరం అతని పాదాల మీద కర్రతో లేదా ఎండిన చేపతో కొడతారు
ముందుగా వరుడి స్నేహితులు వరుడిని తలకిందులుగా వేలాడదీస్తారు. ఆపై స్నేహితులందరూ కలిసి అతని అరికాళ్లపై కొడతారు. ఈ ఆచారాన్ని శిక్ష కంటే చాలా వినోదభరితంగా పరిగణిస్తారు. దక్షిణ కొరియాలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రాథమికంగా మనిషి బలాన్ని పరీక్షించడం.. కొట్టే సమయంలో అతని ఓర్పుకి చిహ్నంగా భావిస్తారు.