ప్రస్తుతం పెట్రలో డీజిల్ రేట్లు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మీరు కారు లేదా బైక్ ద్వారా కాలేజ్, ఆఫీస్ లేదా మరే ఇతర ప్రదేశానికి వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అయ్యింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బండ్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఎలాంటి ఇంధనం లేకుండా నడిచే స్కూటర్ కూడా ఉందని మీకు తెలుసా. ఇప్పుడు ఆ వివరాలు మీకు చెప్పబోతున్నాం.
కాలానుగుణంగా పేదవారు సైతం తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త టెక్నాలజీతో సమానంగా కొత్తకొత్త యంత్రాలను రూపొందిస్తున్నారు. అందులో ఒకటి చుకుడు(Chukudu) అనే ద్విచక్రవాహనం కూడా ఒకటి. ఈ వాహనాలను ఆఫ్రికా దేశమైన కాంగో ప్రజలు ఉపయోగిస్తారు. కాంగో ప్రజలు తమ రోజువారీ జీవితంలో వస్తువులను తీసుకెళ్లడానికి దీనిని ఉపయోగిస్తారు.
ఈ వాహనానికి సైకిల్ కంటే ఎక్కువగా మూడు చక్రాల ఆటో ట్రక్కు మోసేంత బరువును మోయకలిగే సామర్థ్యం ఉంది. కట్టెలు, బస్తాలు, పెద్ద పెద్ద మొద్దులు, ఇంటి సామాగ్రి, ఐరన్ పనిముట్లు, మంచినీళ్లు తదితర సరుకులను సులువుగా రవాణా చేయవచ్చట. ఈ వాహనాలపై ఆధారపడి ఎంతో మంది అక్కడ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి ఇంధనం పోయకుండా కేవలం సులువుగా నడపగలిగే ఈ చుకుడు వాహనాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
చుకుడు వాహనాన్ని మొట్టమొదటిసారిగా 1970 సంవత్సరంలో ఉత్తర కివోలో తయారు చేశారు. దీనికి ఇంజిన్ లేదు, అయినా కూడా 40-50 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిపై ఒకేసారి దాదాపు 700-800 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చట.
చుకుడు వాహనాన్ని యూకలిఫ్టస్ చెక్కతో తయారు చేస్తారు. దీనికి రెండు చెక్క చక్రాలు కూడా ఉంటాయి. ఆ చెక్క చక్రాలకు రబ్బర్ చుట్టి ఉంటుంది. ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇది నడిపే వ్యక్తి ఒక కాలును వాహనం పైన ఉంచుతాడు. మరో కాలుతో నెట్టుకుంటూ నడుపుతాడు. వెనుక చక్రం వద్ద బ్రేక్ వేయడానికి రబ్బర్ ఏర్పాటు చేస్తారు. దాన్ని కాలితో నొక్కిపడితే ఆ చుకుడు వాహనం ఆగిపోతుంది.