- Telugu News Photo Gallery Viral Photos: Srinagar’s Tulip Garden enters record books as Asia’s largest
Srinagar Tulip Garden: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో మన భూతల స్వర్గం.. అరుదైన ఘనత సాధించిన తులిప్ గార్డెన్
ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లోనూ అందాలు.. వాటిని చూస్తే ఇంద్రధనుస్సు నేలపైకి వచ్చినట్లు, భూమే రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. ఇది మనదేశంలోని జమ్ముకశ్మీర్‌లో విరబూసిన తులిప్ పూల ప్రత్యేకత. శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. రంగురంగుల్లో వికసించిన పూలు మైమరిపింపజేస్తున్నాయి. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మంచు కొండల మధ్యలో తులిప్ పూల సోయగాలు కనువిందు చేస్తున్నాయి.
Updated on: Aug 21, 2023 | 12:01 PM

జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 68 రకాలతో కూడిన 1.5 మిలియన్ల తులిప్ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ రికార్డు సృష్టించింది.

ఈ మేరకు ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది.

ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ గొప్పతనాన్ని గుర్తించినందుకు వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ బృందానికి కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు.

కాశ్మీర్లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. శ్రీనగర్‌లోని ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు తరలివస్తుంటారు.

శ్రీనగర్ ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది. నగర సోయగం అక్కడ విరిసే పూలల్లో దాగి ఉంటుంది. రంగురంగుల పూలు ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, రంగుల తివాచీగా మారినట్లు ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది తులిప్ తోట




