
ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా ఇలాంటి దారుణాలు నిత్యం ఏదో ఓ మూల జరుగుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనల్లో ఎంతో మంది అమాయకులు అశువులు బాస్తున్నారు.

అయితే ఇలాంటి దారుణ ఘటనలు మన కళ్ల ముందు జరిగితే వెంటనే స్పందించి బాధితులకు చేతనైన సాయం చేస్తాం. లేదంటే పోలీసులకు సమాచారం అందించి మనమూ మనుషులమనే స్పృహతో చేతనైన సాయం చేసేందుకు వెనకాడం.

కానీ ఆ ఊరి జనాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కాపాడాలంటూ విలవిలలాడుతుంటే.. ఆ ఊరి జనం మాత్రం ఉల్లి బస్తాల కోసం ఎగబడ్డారు.

దొరికిన ఉల్లి బస్తాలను దొరికినట్టు గ్రామస్తులు ఎత్తుకు పోయారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఉల్లిపాయల లారీ నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద ప్రమాదవశాత్తు సోమవారం (నవంబర్ 10) బోల్తా పడింది. ఉల్లిపాయల బస్తాలు రోడ్డు పక్కన పడిపోవడం చూసిన బాటసారులు, వాహనదారులు ఉల్లిపాయల బస్తాలు ఎత్తుకువెళ్లారు.

యూటర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బస్సులోని ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలో ఉల్లిపాయల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అటుగా వెళుతున్న జనాలు ఉల్లిపాయల బస్తాల కోసం ఎగబడి, అందినకాడికి తీసుకెళ్లారు. కాపాడాలంటూ లారీ డ్రైవర్, క్లీనర్ చేస్తున్న ఆర్తనాదాలను కనీసం పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.