
బెలుగుప్పలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో లోకకల్యాణం కోసం శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని చేపట్టారు. యాగంలో భాగంగా 11 మంది వేద పండితులు నీటిలో కూర్చొని వేద పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దాదాపు 80 శాతం వరకు నీటిలో మునిగి రెండు గంటల పాటు వేద మంత్రాలను పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండల కేంద్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.సకాలంలో వర్షాలు కురిసి.. పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని నిర్వహించారు.

శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ యాగంలో 11 మంది వేద పండితులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఆలయ ప్రాంగణంలో నీటిలో కూర్చొని వేద మంత్రాలను పారాయణం చేశారు. దాదాపు 80 శాతం వరకు నీటిలో మునిగి.. సుమారు రెండు గంటల పాటు వేద పండితులు వేద పారాయణం చేశారు. వేద మంత్రాల నడుమ సాగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

వర్షాలు సమృద్ధిగా కురవాలని.. రైతులకు పంటలు పండాలని.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వరుణ యాగం అనంతరం శ్రీ రామేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా గోవులకు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీ రామేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో నిర్వహించిన ఈ వరుణ యాగం భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను నింపింది. వేద పండితులే నీటిలో కూర్చుని వరుణ యాగం చేయడం.. అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.