
టమాటాల వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాలను హెయిర్ మాస్క్‌లుగా తయారు చేసుకొని వాడితే వెంట్రుకలకు మరింత పోషకాలు అందుతాయని చెబుతున్నారు. టమాటాల్లో జుట్టుకు మేలు చేసే విటమిన్ ఏ, సీ, కేతో పాటు లిక్టోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

జుట్టు పెరుగుదలను టమాటాలు వేగవంతం చేస్తాయి. టామాటాలోని పోషకాలు తలలో చుండ్రు సమస్యను దూరం చేస్తాయి. టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా సహకరిస్తాయి. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా, జుట్టు దృఢత్వం పెరిగేలా చేస్తుంది.

ఇందుకోసం ఓ టమాటాను ముందుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో ఓ స్పూన్ తేనె వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు,స్కాల్ప్ కు బాగా పట్టించాలి. సుమారు 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టులో చుండ్రు తగ్గుతుంది. మెరుపు పెరుగుతుంది. జుట్టు దృఢత్వం మెరుగుపడుతుంది.

టమాటా, పెరుగుతో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా టమాటాలో తగినంత పెరుగు వేసి మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, స్కాల్ప్‌కు బాగా పట్టించాలి. ఆ తర్వాత జుట్టును ఆరనివ్వాలి. అనంతరం కడిగేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల జుట్టు పొడిబారడం, చిక్కులు పడడం తగ్గిపోతుంది. పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

టమాటాతో మరో హెయిర్ ప్యాక్ కోసం టమాటా ప్యూరీ తయారు చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ వేసుకోవాలి. గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.