
పొగమంచు తీవ్రంగా ఉన్న సమయాల్లో పాదాచారులు సాధ్యమైనంత వరకు రోడ్లపైకి రాకుండా ఉండాలని, బయటకు రావలసి వచ్చినా అత్యంత జాగ్రత్తగా నడవాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లను దాటేటప్పుడు రెండు వైపులా స్పష్టంగా చూసి ముందుకు సాగాలని, నల్లటి లేదా మసకబారిన దుస్తులు ధరించడం ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని హెచ్చరిక ఇచ్చారు. కాంతివంతమైన దుస్తులు, రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ పాదచారుల భద్రతకు కీలకం అని తెలియజేశారు.ద్విచక్రవాహనదారులు పొగమంచులో వేగం పెంచటం అత్యంత ప్రమాదకరమని పోలీసులు స్పష్టం చేశారు. హెడ్‌లైట్స్, ఫాగ్ లైట్లు, టెయిల్ లైట్లు పరిశుభ్రంగా ఉంచి ఎప్పటికప్పుడు ఆన్‌లో ఉంచాలని సూచించారు. వాహనాల మధ్య కనీస సురక్షిత దూరం పాటించటం, బ్రేక్‌ను ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా వాడటం రోడ్డు భద్రతకు ముఖ్యమని తెలిపారు. టర్న్‌లు, లేన్ మార్పులు చేసే ముందు తప్పనిసరిగా ఇండికేటర్లు వాడాలని, అవసరంలేని లేన్ మార్పులు నివారించాలని పోలీసుల సూచన.

ముఖ్యంగా టూ-వీలర్ డ్రైవర్లు ఉదయం వేళల్లో వేగంగా వెళ్లకూడదని, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, హెల్మెట్ వైజర్ పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని పోలీసులు హెచ్చరించారు. వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్, టార్చ్, అవసరమైన టూల్స్ ఉండటం అత్యంత ఉపయోగకరమని తెలిపారు. అలాగే పెద్ద వాహనాలు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా వాడాలని, హెడ్లైట్లు–టెయిల్ లైట్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని సూచించారు.

విండ్షీల్డ్‌ను పరిశుభ్రంగా ఉంచటం, డిఫాగర్ లేదా యాంటీ ఫాగ్ మోడ్ వాడటం పొగమంచు పరిస్థితుల్లో డ్రైవింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు గుర్తుచేశారు. క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవద్దని, అలసటతో డ్రైవింగ్ చేయడం ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుందని, కాబట్టి డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

పొగమంచు ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని, ఎమర్జెన్సీ సమయంలో వాహనాన్ని ఎడమ లేన్‌లో మాత్రమే ఆపాలని, అకస్మాత్తుగా వాహనాన్ని ఆపడం ప్రమాదకరం అని చెప్పారు. ORR మరియు హైవేలలో పొగమంచు ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు అప్రమత్తత అవసరమని సైబరాబాద్ పోలీసులు హితవు పలికారు.

శీతాకాలంలో పొగమంచు కారణంగా జరిగే ప్రమాదాలను నివారించాలంటే పాదచారులు, బైక్ రైడర్లు, కార్ డ్రైవర్లు—ఎవరైనా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న తప్పిదం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. “అప్రమత్తతే రక్ష” అని మరోసారి స్పష్టం చేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.