- Telugu News Photo Gallery Technology photos What Happens To Your Brain If You Stop Using Smart Phone For Three Days
Smart Phone: ఓర్నీ ఇది పెద్ద కథే.. స్మార్ట్‌ఫోన్ 3 రోజులు వాడటం మానేస్తే.. ఏం జరుగుతుందో తెల్సా
నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధ్యయనాల ప్రకారం, మీరు మీ ఫోన్‌కు మూడు రోజులు దూరంగా ఉంటే, మెదడు దానంతట అదే రీబూట్ అవుతుంది.
Updated on: Mar 17, 2025 | 8:30 AM

పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్య ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ కచ్చితంగా స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అతిగా స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో వరుసగా మూడు రోజులు స్మార్ట్‌ఫోన్ వాడకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా.? మీకు ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే.. ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని ఇటీవల ఎక్స్‌పర్ట్‌లు చేసిన ఓ సర్వేలో తేలింది.

మానవ మెదడుపై కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావాలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం మెదడు సాధారణ అభివృద్ధిని, అంతర్గత రసాయన ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు అత్యవసర పరిస్థితులలో తప్పితే, 72 గంటల పాటు తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, అత్యవసర పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు కాల్స్ తప్ప.. వారు తమ ఫోన్లన్నింటినీ దూరంగా ఉంచారు.

ఈ ప్రక్రియను మూడు రోజుల పాటు కఠినంగా అమలు చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించవద్దని చెప్పినప్పుడు.. వారంతా ధూమపానం, మద్యం సేవించకుండా ఎలా కఠినంగా ఉంటారో.. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలోనూ ప్రవర్తించారని తెలుస్తోంది.

18-30 సంవత్సరాల వయస్సు గల 25 మంది వ్యక్తులను 72 గంటల పాటు తమ ఫోన్‌లను ఉపయోగించకుండా నిషేధించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో చాలా మందికి గేమింగ్ అలవాటు ఉంది. వారి ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, డోపమైన్ లేదా సెరోటోనిన్ వంటి మెదడు రసాయనాల స్రావంలో తేడాలు కనిపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కొంతమందిలో అనవసరమైన ఆందోళన, అధిక ఆకలి, మరికొందరిలో సైలెన్స్, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ అధ్యయనంలో పాల్గొన్న తర్వాత వారిలో మార్పులు కనిపించాయని.. వారి మెదడు దానంతట అదే సాధారణంగా పనిచేయగలిగిందని.. స్వయంగా రీబూట్ అయిందని పరిశోధకులు వివరించారు.




