
ప్రస్తుతం పెళ్లీల సీజన్ నడుస్తుంది. కార్తీక మాసం అవ్వడంతో ఈ సమయంలో చాలా మంది తమ పిల్లలకు వివాహం నిశ్చయం చేస్తుంటారు. ఇక వివాహం అంటే అందరికీ గుర్తు వచ్చేది, పెళ్లి పత్రికలు. ప్రతి ఒక్కరూ తమ వివాహానికి హాజరు అవ్వాలని బంధు మిత్రులకు వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు. అయితే దీనిపై వాస్తు శాస్త్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే పెళ్లి పత్రికల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

వివాహ పత్రిక అంటే రెండు కుటుంబాల ఆనందానికి సంబంధించినది, ఇద్దరు వ్యక్తులు వారి ,కుటుంబాల కలయికకు సంబంధించింది. పెళ్లి అనేది పెళ్లి పత్రికతోనే మొదలు అవుతుంది. అందుకే వీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లి పత్రికను ముందుగా తమ ఇష్టదైవానికి అందించడం లాంటిది చేస్తుంటారు. అయితే ఇంత గొప్ప వెడ్డింగ్ కార్డు తయారు చేసే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకూడదంట.

ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి పత్రికలపై వధూవరుల ఫొటోలను వేయించుకుంటున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డుపై వధూ వరుల ఫొటోలు వేయించుకోవడం అశుభకరమైనదంట. ఇది ఇద్దరిపై చెడు దృష్టిని పెంచడమే కాకుండా, వివాహ సమయంలో విభేదాలు, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. అందుకే ఎప్పుడు కూడా పెళ్లి పత్రికలపై ఫొటోలు వేయించుకోకూడదంట.

ఇక పెళ్లి పత్రికలపై గణేషుడి ఫొటో లేదా తమ ఇష్టదైవం ఫొటోలు ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, పెళ్లి పత్రికలపై వినాయకుడి ఫొటో, ఇతర దేవుళ్ల ఫొటోలు వేయించడం వలన అది వారిని అగౌరవ పరిచినట్లు ఉంటుందంట. ఎందుకంటే? పెళ్లి తర్వాత వాటిని చాలా మంది ఎక్కడెక్కడో పారేస్తారు. అందువలన పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫొటోలు వేయించకూడదంట. దానికి బదులు "శ్రీ గణేశాయ నమః," "శుభ వివాహ్," లేదా "శుభ మంగళం" అనేవి అచ్చు వేయించుకోవాలంట.

పెళ్లి పత్రికల విషయంలో అతి ముఖ్యమైనది రంగు. చాలా మంది ఇప్పుడు తమకు నచ్చిన రంగుల్లో పెళ్లి పత్రికలు అచ్చు వేయించుకుంటున్నారు. అయితే ఎప్పుడూ కూడా పెళ్లి పత్రిక రంగు అనేది సానుకూలంగా ఉండాలంట. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండటం చాలా శుభ ప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)