
దీపావళి పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండగ జరుపుకునే విషయంలో వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం ఇంటిని అలంకరించడం, ఇంటిలోకి కొత్త వస్తువులను కొని తీసుకుని రావడం వంటి పనులు చేయాలి. ఇలా వాస్తుని పాటించడం వలన ఇంట్లోకి శ్రేయస్సు, సానుకూలత, అదృష్టం, జ్ఞానాన్ని స్వాగతించడానికి సరైన అంతర్దృష్టిని కూడా ఇస్తుంది.

దీపావళికి ముందు కొన్ని పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకు రావడం వలన సంపదను ఆకర్షించడంలో, ప్రతికూల శక్తిని తొలగించడంతో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దీపావళికి ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి వేడుకకు ముందు మీరు ఒక లోహ తాబేలును ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదం. ఇది విష్ణువు, లక్ష్మీ దేవి నుంచి సానుకూల శక్తిని, దైవిక ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు.

కొబ్బరికాయను లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది స్వచ్ఛత, సమృద్ధిని సూచిస్తుంది. సంప్రదాయం ప్రకారం దీపావళికి ముందు మీరు కొబ్బరి కాయని ఇంటికి తెచ్చుకోవడం శుభాలను కలుగజేస్తుంది. దానిని పూజ గదిలో ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహం పక్కన ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని విశ్వసిస్తారు

తులసి మొక్క హిందూ సంస్కృతిలో పవిత్రమైన మొక్కలలో ఒకటి. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. మంచి ఆరోగ్యం , ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ తులసి మొక్కను దీపావళికి ముందు మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి.

కుబేర యంత్రం అని కూడా పిలువబడే శ్రీ యత్రం సంపద , అవకాశాలను ఆకర్షించే శక్తివంతమైన రేఖాగణిత చిహ్నం. శ్రీ యంత్రాన్ని పూజించడం వల్ల వాస్తు లోపాలు తొలగిపోతాయి. దీంతో ఆర్థిక ఇబ్బంది తగ్గి.. కెరీర్ లో అవకాశాలు కలగడానికి సహాయపడుతుంది. ఇంటిలోని పూజ గదిలో ఈ శ్రీ యంత్రాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి.

ధన్ తేరస్ , దీపావళి పండుగలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం ఏమిటంటే గణేశుడు, లక్ష్మీ దేవి కొత్త విగ్రహాలను కొనుగోలు చేయడం. లక్ష్మి గణపతిల విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి, గణపయ్య ఆశీర్వాద బలంతో ఇంట్లో సంపద, అదృష్టం, జ్ఞానం కలుగుతుందని నమ్మకం. ఈ విగ్రహాలను ఇంటి పూజా గదిలో ఈశాన్య మూలలో ఉంచండి.