
వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది.

మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర కారకుడు గురువు సంచారం వల్ల విద్యార్థుల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. చదువులతో పాటు విద్యార్థులకు అనేక అంశాలు, క్రీడలు, తదితర కార్యకలాపాల మీద కూడా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. వారికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆటంకాలు, అనారోగ్యాలేవీ ఉండకపోవచ్చు.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు తప్ప కుండా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లోనే కాక, పరీక్షలు, క్రీడలు, కళల్లో కూడా రాణించే అవకాశం ఉంది. చదువులకు సంబంధించి విద్యార్థులకు అనేక అవకాశాలు అందుతాయి. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పిల్లలు ఆశించినదాని కంటే ఎక్కువగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. చదువుల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.

తుల: విద్యకు, సంతానానికి కారకుడైన గురువు ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విద్యార్థులు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. పాఠ్యేతర అంశాలలో విద్యార్థులు దూసుకుపోయి, రికార్డులు సృష్టించడం జరుగుతుంది. అనేక శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తప్పకుండా తాము కోరుకున్న కోర్సుల్లో చేరడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ యోగానికి అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి గురువు సప్తమ స్థానంలో బుధుడికి చెందిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. చదువులను నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులు కూడా చదువుల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులలో చాలా మార్పు చోటు చేసుకుంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం, మరిన్ని నైపుణ్యాల కోసం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. టెక్నికల్, టెక్నలాజికల్ రంగాల్లో బాగా రాణిస్తారు. ఆశించిన గుర్తింపు పొందుతారు.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులకు తప్పకుండా చదువుల మీద, కళలు, పాఠ్యేతర అంశాల మీద శ్రద్ధ పెరుగుతుంది. క్రమ శిక్షణ పెరగడం, చదువులతో పాటు క్రీడలు, కళా రంగాల్లో రాణించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విద్యార్థుల మీద పెట్టుకున్న ఆశలన్నీ పూర్తిగా నెరవేరుతాయి. ఉన్నత విద్యకు వెళ్ల డం, ఇష్టపడిన కోర్సులో చేరడం, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించడం వంటివి జరుగుతాయి.