
మేషం: ఈ రాశికి చెందిన మహిళలు ఇంటిని చక్కబెట్టడంలో, కుటుంబ నిర్వహణలో అమోఘమైన సామ ర్థ్యం కలిగి ఉంటారు. జీవిత భాగస్వామికి అన్ని విధాలుగానూ అండదండలను ఇస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల సంపద పెరగడం, ఇల్లూ, వాహన సౌకర్యాలు అమరడం, వృద్ధాప్యంలో చీకూ చింతాలేని జీవితాన్ని గడపడం వంటి వాటికి అవకాశం ఉంటుంది. పిల్లల సంరక్షణలోనూ, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడంలోనూ వీరికి సహజసిద్ధమైన ప్రావీణ్యం ఉంటుంది.

మిథునం: ఈ రాశికి చెందిన మహిళల్లో దూరదృష్టి ఎక్కువ. జీవితం సజావుగా, సంతృప్తికరంగా సాగిపోవడా నికి మొదటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సాధారణంగా తగాదాలు, వాగ్వాదాల జోలికి పోరు. ఒకటికి రెండుసార్లు ఆలోచించనిదే నిర్ణయాలు తీసుకోరు. ప్రస్తుతం ఈ రాశివారికి శుక్రుడు అనుకూల స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారు తేలికగా ఇతరులను ఆకట్టుకుంటారు. పిల్లలను విద్యా విషయాల్లో తీర్చిదిద్దడంలో వీరికి వీరే సాటి. జీవిత భాగస్వామికి అదృష్టాన్ని కలిగిస్తారు.

సింహం: ఈ రాశికి చెందిన మహిళలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఎంతో ఆశావాదంతో వ్యవహరి స్తారు. దేనికీ చలించకపోవడం, నిబ్బరంగా వ్యవహరించడం వీరి సహజ గుణం. కుటుంబ నిర్వహ ణలోనే కాక, జీవిత భాగస్వామితో నైపుణ్యంగా వ్యవహరించడంలో వీరిని మించిన వారుండరు. ప్రస్తుతం ఈ రాశివారికి మాంగల్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల వీరిని ప్రేమించినవారు, పెళ్లి చేసుకున్నవారు తిరుగులేని అదృష్టవంతులవుతారు. జీవిత భాగస్వామికి కొండంత అండగా ఉంటారు.

తుల: ఈ రాశి మహిళల్లో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. లౌక్యంగా, జాగ్రత్తగా వ్యవహరించడంలో ముందుంటారు. కుటుంబ బాధ్యతలను నిర్వహించడమనేది వీరికి కొట్టిన పిండి. ఎటువంటి సమస్యనైనా తేలికగా పరిష్కరిస్తారు. వీరిని జీవితాంతం అదృష్టం వెన్నాడుతూనే ఉంటుంది. వీరితో ప్రేమలో పడినా, పెళ్లాడినా ఆ వ్యక్తి జీవితం యోగదాయకంగా సాగిపోతుంది. పైగా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛలో ఉండడం వల్ల వీరితో ప్రేమలో పడినవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.

ధనుస్సు: ఎంతో ఆశావాదంతో, సానుకూల దృక్పథంతో వ్యవహరించే ధనూరాశి మహిళలు స్వేచ్ఛకు, సాహసానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. జీవిత భాగస్వామిని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటారు. ధనూ రాశి మహిళలను పెళ్లాడినవారు జీవిత కాలమంతా నిశ్చింతగా, చీకూ చింతా లేకుండా గడుపుతారని జ్యోతిషశాస్త్రం కూడా చెబుతుంది. జీవితం పట్ల పరిపూర్ణమైన అవగాహనతో వ్యవ హరించే ఈ రాశి మహిళలు సుఖ సంతోషాలతో కాలం గడపడానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.

కుంభం: ఈ రాశి మహిళల్లో భావోద్వేగాలతో పాటు, ఆధ్యాత్మిక చింతన కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలకు, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా, గోప్యంగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి అతి తక్కువ స్థాయిలో ఉన్నా అతన్ని సంపన్నుడుగా మార్చగల తెలివితేటలు వీరిలో అపారంగా ఉంటాయి. ప్రస్తుతం వీరికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వీరి ప్రేమను చూరగొన్నవారు సంపన్నులవుతారు.