
దేవుని గడప కడప జిల్లా.. ఇక్కడ ఉన్న ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉగాది రోజున ముస్లిం భక్తుల సందడి కనిపిస్తుంది. ముస్లింలు ఇక్కడికి వచ్చి ఉగాది రోజున పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

దీనికి పెద్ద కారణమే ఉంది వెంకటేశ్వర స్వామి రెండో భార్య అయిన బీబి నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో ముస్లింలందరూ ప్రతి ఏడాది ఉగాది రోజున ఆయనను పూజిస్తారు

కడప నగరంలోని దేవుని గడప దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరంతా వారి మొక్కలను తీర్చుకుంటారు పుట్టింటి వారు చీర సారే ఎలా తీసుకువెళతారో అదే విధంగా ప్రతి ఏడాది ముస్లిం మహిళలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు బీబీ నాంచారమ్మను తమ పుట్టింటి ఆడపడుచు గా భావిస్తూ ఆమెకు చీర సారే సమర్పిస్తారు.

అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకుంటారు వెంకటేశ్వర స్వామి తమ పుట్టింటి ఆడపడుచును పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయనను తమ బావగారిగా భావించి ముస్లింలు కొలుస్తారు.

ఉగాది రోజు తొలి పూజను వారే నిర్వహిస్తారు అంతేకాక ప్రతి ఏడాది ఈ నిర్వహించే పూజలలో తమ తీరని కోర్కెలను కోరుకొని వాటిని సిద్ధింప చేసుకుంటామని వారు చెబుతున్నారు.

ఇక్కడకు వచ్చి మొక్కుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా తీరుతాయని ముస్లింల భావన అందుకే ప్రతి ఏటా ముస్లింలు ఉగాది రోజున తప్పకుండా వచ్చి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.