
నవరాత్రి పండుగ సందర్భంగా 9 రోజులు అమ్మవారిని పూజిస్తారు. శక్తికి ప్రతీక అయిన ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కానీ మన దేశంలోని అనేక నగరాలకు దుర్గాదేవి, ఆమె అవతారాల పేరు పెట్టారు. ఈరోజు దేశంలో ప్రసిద్ధ నగరాల గురించి మనం తెలుసుకుందాం..

శ్రీనగర్: ప్రజలు తమ సెలవులను గడపడానికి తరచూ శ్రీనగర్‌కు వెళ్తూ ఉంటారు. శ్రీనగర్ నగరం పేరు కూడా దేవత పేరు మీద ఏర్పడిందే. శారికా దేవి ఆలయంలో శ్రీచక్ర రూపంలో ఉన్న శ్రీ లేదా లక్ష్మీ దేవి నివాసం శ్రీనగర్ అని పురాణాల కథనం.

పాట్నా: పురాణాల ప్రకారం.. సతీదేవి కుడి తొడ పడిన ప్రదేశం పాట్నా. ఈ ప్రదేశంలో పటాన్ దేవి గౌరవార్థం దుర్గామాత రూపంలో ఆలయాన్ని నిర్మించారు.

త్రిపుర: ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర చాలా అందమైన పురాతన నగరం. ఈ నగరం త్రిపుర సుందరి దేవాలయం పేరు మీదుగా ఏర్పడింది. ఈ ఆలయం అగర్తల నుండి 55 కి.మీ దూరంలో కొండపై ఉంది.

ముంబై: ఈ నగరానికి ముంబా దేవి అమ్మవారి మీదుగా ముంబై అనే పేరు వచ్చింది. ముంబా దేవి ఆలయం జావేరి మార్కెట్ సమీపంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. సుమారు 500 సంవత్సరాల క్రితం మహా అంబా దేవి గౌరవార్థం నిర్మించబడింది.

చండీగఢ్: చండీగఢ్ అందమైన నగరం చండీ దేవి పేరు మీదుగా ఏర్పడింది. ఇక్కడ చండీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సనాతన హిందూ ధర్మంలో విశిష్టమైన స్థానం ఉంది. స్థానిక ప్రజలు, పర్యాటకులు భారీగా హాజరవుతారు.