
మేషం: ఈ రాశివారికి ఈ యోగాల వల్ల అత్యంత శుభ ఫలితాలు సమీప భవిష్యత్తులో అనుభవానికి వస్తాయి. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఆదాయ వృద్ధికి ఈ మూడు రోజుల్లో వీరు చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు తప్పకుండా సమీప భవిష్యత్తులో అత్యధికంగా లాభాలనిస్తాయి. చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, పుష్య పౌర్ణమి వీరిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడంతో పాటు అత్యంత ధనికుడిని చేస్తాయి.

మిథునం: ఈ నాలుగు యోగాలకు ఈ రాశితో, రాశ్యధిపతితో సంబంధం ఉండడం వల్ల ఇవి ఈ రాశివారికి పూర్తి స్థాయిలో శుభ ఫలితాలను, శుభయోగాలను ఇస్తాయి. ముఖ్యంగా వీరి మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. ఈ రాశివారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఈ 3, 4, 5 తేదీల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అవి తప్పకుండా కలిసి వస్తాయి. పదోన్నతులకు, ఆదాయ వృద్ధికి తప్పకుండా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం, పంచమ స్థానంలో బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలు కలగడం వల్ల అదృష్ట దేవత ఒకటికి రెండుసార్లు ఈ రాశివారి ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు కెరీర్ పరంగా పురోగతి చెందడానికి వీరు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అనే విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం, తృతీయంలో చంద్ర మంగళ, బుధాదిత్య, పుష్య పౌర్ణమి యోగాలు చోటు చేసుకోవడం వల్ల 3, 4, 5 తేదీలు అనేక విధాలుగా కలసి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు నూరు శాతానికి మించి లాభిస్తాయి. ఆదాయ వృద్దికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, విదేశాలకు వెళ్లడానికి సంబంధించి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశిలో పుష్య పౌర్ణమి, చంద్ర మంగళ యోగం, బుధాదిత్య యోగం ఏర్పడడం, ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, చంద్రుల యుతి వల్ల గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారు అత్యంత ప్రముఖుల కోవలో చేరిపోయే అవకాశం ఉంది. సామాజికంగా పలుకుబడి, కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజపూజ్యాలు, రాజకీయ ప్రాబల్యం కలుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. జీవనశైలి మారిపోతుంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గజకేసరి యోగం, లాభస్థానంలో చంద్ర మంగళ, బుధాదిత్య యోగాలతో పాటు, పుష్య పౌర్ణమి చోటు చేసుకోవడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఈ మూడు రోజుల్లో సరైన నిర్ణయాలు, సరైన ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.