- Telugu News Photo Gallery Spiritual photos Positive Planetary Position: These Zodiac Signs to get Luck, Success and Prosperity
Lucky Zodiac Signs: కీలక గ్రహాల అనుకూలత.. జూన్ నుంచి పైపైకి దూసుకుపోయే రాశులివే!
Telugu Astrology: జూన్ నుంచి ఆరు నెలల పాటు శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి తమ తమ రంగాల్లో దూసుకుపోయే రాశులు మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులు. ఈ రాశుల వారికి చిన్నపాటి అవకాశం లభించినా పైపైకి ఎదిగిపోతారు. ప్రస్తుతం వీరికి గురువు, రవి, కుజుడు, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకాశమే హద్దుగా వీరి జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఆదాయం, అధికారం, ప్రాముఖ్యం, ప్రాధాన్యం, ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో వీరి ప్రయత్నాలు తేలికగా విజయాలు సాధిస్తాయి.
Updated on: May 22, 2025 | 4:41 PM

మేషం: నాయకత్వ లక్షణాలు, కలుపుగోరుతనం, వ్యూహం, ప్రణాళిక వంటి లక్షణాలను కలిగి ఉండడంతో పాటు దూసుకుపోయే తత్వానికి మారు పేరుగా ఉండే ఈ రాశివారు కొద్దిపాటి నైపుణ్యాలతో, చిన్నా చితకా పరిచయాలతో అంచనాలకు మించి పురోగతి సాధించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల ఆశ కూడా నెరవేరుతుంది.

కర్కాటకం: ఆత్మవిశ్వాసం, కృతనిశ్చయం, పట్టుదల వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారు ఉద్యోగంలో తమ విశిష్టతను, ప్రత్యేకతను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు. ఇతరులకు భిన్నమైన మార్గాలను అనుసరించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ ఏడాది లోపు వీరు ఒకటికి రెండుసార్లు పదోన్నతి పొందే అవకాశం ఉంది. రకరకాలు పద్ధతులను, మార్గాలను అనుసరించి ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. వీరి మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి.

సింహం: పట్టువదలని విక్రమార్కుల్లాంటి సింహ రాశివారు సాధారణంగా ఏ అవకాశాన్నీ వదిలిపెట్టరు. చిన్న అవకాశాన్ని కూడా గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగమైనా, వృత్తయినా, వ్యాపారమైనా దాని మీద వారి ముద్ర ఉండాల్సిందే. వీరు ప్రతి పనిలోనూ, ప్రతి వ్యవహారంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. బంధుమిత్రులతో పోటీ పడి ఆదాయ వృద్ధిలో మొదటి స్థానానికి చేరుకుంటారు. ఏ ఉద్యోగంలో ఉన్నా తమ శక్తి సామర్థ్యాలతో అందలాలు ఎక్కుతారు.

తుల: ఏక కాలంలో అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన సామర్ధ్యం కలిగిన ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో తమ సమర్థతను నిరూపించుకుంటూనే తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు. ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఉద్యోగంలో అందలాలు ఎక్కు తారు. వీరి సారథ్యంలోని వృత్తి, వ్యాపారాలు ఈ ఏడాది తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది.

వృశ్చికం: కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసం పాటుబడి సాధించుకోవడంలో ఈ రాశివారే ముందుంటారు. వ్యూహ రచనలో, ఆత్మ విశ్వాసంలో, మొండి పట్టుదలలో వీరికి వీరే సాటి. ఓటమిని ఒక పట్టాన అంగీకరించని ఈ రాశివారు దేనినైనా కొద్ది ప్రయత్నంతో సాధించడం జరుగుతుంది. ఏ స్థాయిలో ఉన్నా ఆదాయాన్ని పెంచుకుని సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించుకుంటారు. ఉన్నతస్థాయి జీవనశైలి కోసం గట్టి పట్టుదలతో కృషి చేస్తారు. ఈ ఏడాది అన్నిటా వీరిదే పైచేయి.

ధనుస్సు: దూసుకుపోయే తత్వం, పట్టుదల, పరిపూర్ణ ఆత్మవిశ్వాసం కలిగిన ఈ రాశివారు యాంబిషన్ కు మరో పేరు. ఈ రంగంలో ఉన్నా ఆ రంగం మీద వీరి ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరచుకుంటుంటారు. నైపుణ్యాలకు, ప్రతిభకు పదును పెట్టుకుంటారు. ఈ ఏడాది వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాలను అనుసరించి విజయాలు సాధిస్తారు.



