
హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను సూచిస్తుందని నమ్మకం. సూర్య పర్వతం ఆకారం, ఉబ్బెత్తుదనం, అలాగే దానిపై కనిపించే కొన్ని ప్రత్యేక గుర్తుల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయవచ్చని హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఈ ఐదు గుర్తులు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు.

చతురస్ర గుర్తు.. సూర్య పర్వతంపై చతురస్ర ఆకారం కనిపిస్తే అది మంచి సంకేతంగా భావిస్తారు. ఇలాంటి వారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో పాటు, సేవా కార్యక్రమాల ద్వారా గౌరవం పొందుతారు. ప్రభుత్వ శాఖల నుంచి సహకారం లేదా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతారు. వీరి జీవితం సాధారణంగా సుఖసంతోషాలతో నిండివుంటుంది.

వృత్తాకార గుర్తు.. సూర్య పర్వతంపై వృత్తం ఆకారపు గుర్తు ఉండటం అరుదు. అయితే ఈ గుర్తు ఉన్నవారు జీవితంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. కష్టపడి పనిచేసే స్వభావం వీరికి విజయాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుంది.

త్రిభుజ గుర్తు.. త్రిభుజం గుర్తు అత్యంత శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గుర్తు ఉన్నవారు కళారంగంలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారని చెబుతారు. సంగీతం, నటన, చిత్రకళ వంటి రంగాల్లో వీరి ప్రతిభ ప్రత్యేకంగా మెరవొచ్చు.

నక్షత్ర గుర్తు.. సూర్య పర్వతంపై నక్షత్ర గుర్తు కనిపిస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయని హస్తసాముద్రికం చెబుతుంది. ఇలాంటి వారు ఉన్నత పదవులు చేపట్టి, సంపదతో పాటు మంచి కీర్తిని కూడా పొందుతారు. ఆర్థికంగా కూడా వీరు బలంగా నిలుస్తారు.

అనేక గీతలు.. సూర్య పర్వతంపై స్పష్టమైన గీతలు ఎక్కువగా ఉండటం కూడా శుభప్రదమే. ఇవి ఉన్నత వృత్తి అవకాశాలు, బాధ్యతాయుతమైన పదవులు, కృషితో సాధించే విజయాలను సూచిస్తాయి. ఇలాంటి వారు ఏ పని చేసినా నిబద్ధతతో పూర్తి చేస్తారని నమ్మకం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం హస్త సాముద్రికా శాస్త్రం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)