
మిథునం: రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో ఉన్నప్పటికీ, ఆ బుధుడి మీద ఉచ్ఛ గురువు దృష్టి పడడం వల్ల బుధుడు దీర్ఘకాలిక ఆర్థిక, వ్యక్తిగత సమస్యలనన్నిటికీ పరిష్కరించడంతో పాటు కొత్త సమస్యలు దరి చేరకుండా చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

సింహం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న బుధుడి మీద గురువు దృష్టి పడడం వల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రభుత్వ రంగంలోకి మారడానికి అవకాశాలు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు రికార్డులు సృష్టిస్తారు. ఆస్తి వివాదాల్లో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కన్య: రాశినాథుడు బుధుడు తృతీయ స్థానంలో ఎంతో ధైర్య సాహసాలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. గట్టి పట్టుదలతో వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆదా యాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలను, అవకాశాలను ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో సీనియర్లతో పోటీపడి ఉన్నత పదవులు దక్కించుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా విజయాలు సాధిస్తారు.

కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న బుధుడిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు ఎటువంటి పోటీల్లోనైనా విజయం సాధించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తప్ప కుండా నెరవేరుతుంది. ఉద్యోగం మారి, ఉన్నత పదవులు చేపట్టడానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సరికొత్త నైపుణ్యాలను అలవరచుకోవడం జరుగుతుంది. మంచి స్నేహ సంబంధాల్ని పెంచుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న బుధుడిని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల కుటుంబంలోనూ, కెరీర్ లోనూ కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించడంతో పాటు మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల లాభం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలే కాకుండా ఆస్తి సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.