గణేశునికి ఇష్టమైన చింతపండు పులిహోరకి కావాల్సినవి : బియ్యం : ఒక కప్పు, చింతపండు: కొద్దిగా, పసుపు : ఒక టేబుల్ స్పూన్, పల్లీలు : 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు : ఒక టీ స్పూన్, శెనగపప్పు : ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు : 4, నూనె, ఉప్పు : తగినంత, పచ్చిమిర్చి-4, మిరియాలు- ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు-తగినంత. మొదటిగా చింతపండును వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టిన తర్వాత అన్నం కొంచెం పొడిపొడిగా వండాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో చింతపండు రసం, కొన్ని నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసి.. చిక్కగా ఉడికించాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి ఆవాలు, శెనగపప్పును వేయించి ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పులిహోర కలపడానికి వీలుగా ఉండే ప్లేట్ తీసుకుని అందులో ఉడికించిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి కలుపుకోన్న తర్వాత దానిలో ఉడికించిన చింతపండు రసం, ఉప్పు తగినంత వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత అంతకుముందు నూనెలో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి బాగా కలపాలి.