
భారతదేశం విభిన్న సంస్కృతి, నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ప్రతి మూలలో ఏదో ఒక దేవత నివసిస్తుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు బదులుగా రాక్షసులను పూజించే కొన్ని దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇది విన్న మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ రాక్షస ఆలయాల వెనుక విశ్వాసం, జానపద కథలు, శతాబ్దాల నాటి సంప్రదాయాలు దాగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు మన దేశంలో రాక్షసులను పూజించే సంప్రదాయం ఉన్న కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం.

హిడింబా దేవి ఆలయం: హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో ఉన్న హిడింబా దేవి ఆలయం.. భారతదేశంలో రాక్షసిని పూజించే కొన్ని ఆలయాలలో ఒకటి. మహాభారత కాలం నాటి హిడింబా, పరాక్రమవంతుడైన భీముడి భార్యగా, ఘటోత్కచుడి తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజలు హిడింబను దేవతగా భావించి పుజిస్తారు. ఈ ఆలయం చెక్క, రాళ్లతో నిర్మాణం చేయబడింది. పగోడా శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలికి కూడా ప్రసిద్ధి చెందింది.

స్థానిక నమ్మకాల ప్రకారం హిడింబ తన రాక్షస ప్రవృత్తిని విడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని అవలంబించింది. ఆమె తపస్సు చేసి, భక్తి మార్గాన్ని ఎంచుకుంది, దీని కారణంగా ఆమెను దేవతగా పూజించడం ప్రారంభించారు. చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించే ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హుడు అనే వాస్తవానికి ఈ ఆలయం ప్రతీక. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక గొప్ప జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు.

పూతన ఆలయం: శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురకు కొద్ది దూరంలో గోకులంలో ఒక రాక్షసిని పూజించే మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇది పూతన ఆలయం. శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు పంపిన పూతన అనే విషపూరిత రాక్షసి.. నవజాత శిశివైన కృష్ణుడిని సంహరించదానికి పాలివ్వడానికి ప్రయత్నించింది. అయితే బాల కృష్ణుడు ఆమెను సంహరించాడు. అయితే పూతన ఇక్కడ దైవ రూపంలో కనిపిస్తుంది.

పురాణాల ప్రకారం పూతన ఒక రాక్షసి. ఆమె ఏ ఉద్దేశ్యంతో నైనా సరే కృష్ణుడికి పాలిచ్చింది. భారతీయ సంప్రదాయంలో పాలిచ్చే స్త్రీని తల్లితో సమానం అని భావిస్తారు. అందువల్ల కొంతమంది భక్తులు పూతనను "తల్లి"గా చూస్తారు. ఆమె అనుకోకుండానే కృష్ణుడికి పాలిచ్చి మోక్షాన్ని పొందింది. ఈ ఆలయం దైవిక స్పర్శ ఏ పాపినైనా విముక్తి చేయగలదనే ఆలోచనను సూచిస్తుంది.

అహిరావణ ఆలయం అయోధ్యలోని అహిరావణుడి ఆలయం రామాయణంతో ముడిపడి ఉంది. దీనిలో పాతాళలోక రాజు అయిన అహిరావణ అనే రాక్షసుడికి అంకితం చేయబడింది. రామ రావణ యుద్ధ సమయంలో అహిరావణుడు.. రాముడు, లక్ష్మణులను మాయ చేత బంధించి పాతాళలోకానికి తీసుకెళ్లాడు, తరువాత హనుమంతుడు వారిని విడిపించాడు. దాదాపు 300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో, అహిరావణుడితో పాటు, అతని సోదరుడు మహిరావణుడిని కూడా పూజిస్తారు.

మహిషాసుర స్మారక ప్రదేశం కర్ణాటక లో ప్రసిద్ది నగరం మైసూర్ పేరు మహిషాసురుడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు పాలించాడని నమ్ముతారు. దుర్గాదేవి అతన్ని సంహరించింది. అతని జ్ఞాపకార్థం దసరా పండుగ ఇక్కడ ప్రారంభమైంది. మైసూర్‌లోని చాముండి కొండపై మహిషాసురుడి భారీ విగ్రహం ఉంది. ఇది ఆలయం కాకపోయినా.. ఇక్కడి ప్రజలు మహిషాసురుడిని చారిత్రక పాత్రగా భావిస్తారు. అతన్ని భక్తితో కొలుస్తారు.

రావణ దేవాలయం రామాయణంలో రావణుడిని విలన్‌గా పిలుస్తారు. అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రావణుడిని అత్యంత జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడిగా, శివ భక్తుడిగా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో రావణుడి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా రోజున రావణుడిని పూజిస్తారు. అదే సమయంలో హిమాచల్‌లోని కాంగ్రా జిల్లాలో కూడా రావణుడిని పూజించే సంప్రదాయం ఉంది.